ఆదివారం 25 అక్టోబర్ 2020
Khammam - Oct 01, 2020 , 00:15:16

నూతన రెవెన్యూ చట్టం ప్రజలకు వరం

నూతన రెవెన్యూ చట్టం ప్రజలకు వరం

  • సమగ్ర సర్వేకు ప్రతిఒక్కరూ  సహకరించాలి

  • ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య

సత్తుపల్లి: నూతన రెవెన్యూ చట్టం ప్రజలకు వరమని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. బుధవారం మండల పరిధిలోని బేతుపల్లి, తుంబూరు గ్రామాల్లోని ఇంటింటి సర్వేను ఆయన పరిశీలించారు. అనంతరం బేతుపల్లిలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ.. ఎన్నో ఏండ్లుగా పెండింగ్‌లో ఉన్న భూ సమస్యలు పరిష్కరించేందుకు గతంలో భూ ప్రక్షాళన చేపట్టి ప్రతిఒక్కరికి పాస్‌ పుస్తకాలు ఇప్పించారని గుర్తు చేశారు. అయినప్పటికీ మరోసారి రెవెన్యూ చట్టాన్ని ప్రక్షాళన చేసి రాష్ట్రంలోని ప్రతి భూమిని సర్వే నిర్వహించి వ్యవసాయేతర భూములు సైతం మెరూన్‌ కలర్‌ పాస్‌ పుస్తకాలు ఇప్పించేవిధంగా ఇంటింటి సర్వే చేపట్టడం అభినందనీయమన్నారు. ప్రతి ఇంటిని సర్వే చేసి వారి భూమి వివరాలను సేకరించి రికార్డులో పొందుపరుస్తారని, తద్వారా వారు తమ భూములను అమ్మడం, కొనడం సులభతరమవుతుందన్నారు. బేతుపల్లి రెవెన్యూ మండలంలోనే పెద్దదని, 10వేల ఎకరాలకు పైగా ఆ రెవెన్యూలో ఉందని, అయితే ఆ రెవెన్యూ అంతా సర్వే నెంబర్లు తప్పుల తడకగా ఉండటం వలన రైతులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, ఈ విషయాన్ని అసెంబ్లీలో సైతం ప్రస్తావించానని గుర్తు చేశారు.

త్వరలో ప్రత్యేక శాటిలైట్‌ ద్వారా భూ సర్వే చేపట్టి రైతులందరికీ న్యాయం చేసి వారికి పాస్‌ పుస్తకాలు అందజేస్తారన్నారు. దసరా నుంచి ధరణి వెబ్‌సైట్‌ను ప్రభుత్వం ప్రారంభిస్తుందని, వేలిముద్రలు, కంటి స్కానింగ్‌ ద్వారా పాస్‌ పుస్తకాలు అందిస్తుందన్నారు. ఎంపీడీఓ దొడ్డా హైమావతి శంకర్‌రావు, ఆత్మ చైర్మన్‌ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, వైస్‌ ఎంపీపీ దాసరి వెంకటరామిరెడ్డి, సర్పంచ్‌లు పాకలపాటి శ్రీనివాసరావు, మందపాటి శ్రీనివాసరెడ్డి, వేల్పుల కళావతి, బేతిని శ్రీనివాసరావు, నాయకులు కృష్ణారెడ్డి, వెంకటరెడ్డి, యాగంటి శ్రీనివాసరావు, భీమిరెడ్డి గోపాల్‌రెడ్డి, బాలవెంకటేశ్వరరావు, దొడ్డా శ్రీనివాసరావు, రాజేంద్రప్రసాద్‌, ఖాసీం, దుగ్గిరాల రవి, రాచమళ్ల కృష్ణమూర్తి, గోగులమూడి బాలాజీ రెడ్డి, మాచిరాజు వాసు, కర్నాటి వెంకట్రావు తదితరులున్నారు.


logo