Shapewear | అందమైన శరీరాకృతి కోరుకోని అమ్మాయి ఉండదంటే అతిశయోక్తి కాదు. బాడీ మంచి షేప్‌లో ఉండే ఏ డ్రెస్ వేసినా వావ్… అనిపించేలా కనిపిస్తాం. కానీ, ఈ కాలంలో కూర్చొని చేసే ఉద్యోగాలే ఎక్కువ. ఫలితంగా శారీరక శ్రమ తక్కువైంది. దీంతో చాలా మంది బొద్దుగానే కనిపిస్తున్నారు. ఇదే సమయంలో షేప్వేర్స్ వాడకం కూడా అధికమైంది. నిజంగానే ఇవి స్లిమ్ లుక్‌ను ఇస్తాయన్నది కాదనలేని విషయం! అయితే వీటిని అతిగా వాడటం వల్ల రకరకాల ఆరోగ్య సమస్యలు దరి చేరతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. సహజంగా షేప్‌వేర్ అనేది పొత్తి కడుపు చుట్టూ బిగుతుగా పట్టి ఉండే ఒక వస్త్రం. ఇలా టైట్‌గా ఉండటం వల్ల ఆ ప్రాంతంలో గాలి ప్రసరించదు.
ఇది కాస్తా ఈస్ట్ ఇన్ఫెక్షన్ పెరిగేందుకు దారి తీస్తుందట. ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ మూలంగా చర్మం మీద వాపు, దురద వస్తాయి. కొన్నిసార్లు రక్తప్రసరణపైనా ప్రభావం పడుతుంది. వీటిని ధరించినప్పుడు ఏర్పడే అసౌకర్యం కారణంగా చాలా మంది మహిళలు టాయిలెట్లను కూడా ఉపయోగించరు. ఫలితంగా మూత్ర సంబంధిత రుగ్మతల బారిన పడే ప్రమాదం కూడా ఉందట. అంతేకాకుండా బిగుతుగా ఉండే వస్ర్తాలు ధరించడం వల్ల గ్యాస్, ఉబ్బరం, తిమ్మిరి, విరేచనాలు వంటి జీర్ణ సంబంధింత సమస్యలూ తలెత్తే అవకాశం ఉంది. తరచూ వాడకం వల్ల నరాలపై ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి ఫంక్షన్ల సందర్భంలోనో, మరేదైనా ప్రత్యేక సమయంలోనో తప్ప షేప్‌వేర్‌లను ధరించకుండా ఉండటమే మంచిది.