Dumping Yard | హుజూరాబాద్ రూరల్, ఏప్రిల్ 01 : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణ సమీపంలోని సిర్సపల్లి గ్రామ శివారులో ప్రభుత్వం ప్రతిపాదించిన డంపింగ్ యార్డ్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జేఏసీ ఆధ్వర్యంలో 10 రోజులుగా జరుగుతున్న ఆందోళనలు, దీక్షలకు హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీష్ బాబు సంఘీభావం ప్రకటించారు. బుధవారం ఆయన స్థానిక జేఏసీ నేతలతో కలిసి మాట్లాడుతూ.. డంపింగ్ యార్డు నిర్మాణాన్ని విరమించుకుంటున్నట్లుగా ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
డంపింగ్ యార్డు నిర్మాణం జరిగితే ఈ ప్రాంతంలో వాతావరణ కాలుష్యం పెరిగే అవకాశం ఉందని, ఇతర మున్సిపాలిటీల నుండి ఇక్కడికి చెత్తను తరలిస్తారని తద్వారా మానవాళికి, పశుపక్ష్యాదులకు, పర్యావరణానికి ముప్పు పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకసారి డంపింగ్ యార్డు అండ్ ఎనర్జీ ప్లాంట్ నిర్మాణం జరిగితే.. దాని నుండి వెలువడే కాలుష్యం ఆపడం కష్టమని అన్నారు. ప్రతిరోజూ ఇతర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో వాహనాలు చెత్తను ఇక్కడకు తీసుకువస్తామని, తద్వారా దుమ్ము, ధూళి అధికమవుతుందని, రైతుల భూముల ధరలు పడిపోతాయని, పిల్లలకు, మహిళలకు, శిశువులకు, వృద్దులకు ప్రాణహాని ఉంటుందని పేర్కొన్నారు.
డంపింగ్ యార్డ్ నిర్మాణానికి వ్యతిరేకంగా సబ్బండ వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారని, ఇది హుజూరాబాద్ భవిష్యత్తుకు, అభివృద్ధికి, ప్రజల జీవనానికి ముడిపడివున్న సమస్య అని, ప్రజల ఆకాంక్షలను గౌరవించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. తాను కూడా జేఏసి ఆధ్వర్యంలో జరుగుతున్న దీక్షల్లో భాగంగా ఒకరోజు దీక్షలో త్వరలోనే పాల్గొంటానని వివరించారు.