Rasamayi Balakishan | శంకపట్నం మండలం గద్దపాక గ్రామంలో వడ్ల కుప్పపై గుండెపోటుతో ప్రాణాలు విడిచిన రైతు కొయ్యడ ఐలయ్య అంత్యక్రియలకు మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ హాజరై పాడే మోశారు.️ రైతు ఐలయ్య మృతికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
ఎమ్మెల్యే కవ్వంపల్లి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడమే కాదు ధాన్యం తరలించడానికి లారీలు తెప్పించి, మిల్లులు అలాట్ చేయించాలన్నారు. రైతు ఐలయ్య కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా అందించాలి. రైతుల ధాన్యం కొనకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అరిగోస పెడుతున్నదని, ఇందిరమ్మ రాజ్యంలో రైతుల బ్రతుకులు బుగ్గిపాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎండకు.. వానకు ఓర్చి.. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి పంట పండించి కొనుగోలు కేంద్రంలో పోస్తే ధాన్యం కొనే దిక్కులేక గుండె బరువెక్కి రైతన్నలు వడ్ల కుప్పలపైనే గుండెపోటుతో మరణిస్తున్నారని మానకొండూర్ మాజీ శాసనసభ్యులు రసమయి బాలకిషన్ అన్నారు.
శంకరపట్నం మండలంలోని గద్దపాక సర్పంచ్ కొయ్యడ పర్శరాం గారి తండ్రి కొయ్యడ ఐలయ్య అనే రైతు వరికోసి ధాన్యాన్ని గత 15 రోజుల క్రితమే కొనుగోలు కేంద్రంలో పోసినప్పటికీ తూకం వేయకపోవడంతో రైతు ఐలయ్య మంగళవారం రోజున వడ్ల కుప్పపైనే గుండెపోటుతో మరణించారు.
గుండెపోటుతో మరణించిన ఐలయ్య అంత్యక్రియల్లో రసమయి బాలకిషన్ పాల్గొని పాడే మోశారు. ఈ సందర్భంగా రసమయి బాలకిషన్ మాట్లాడుతూ.. రైతు ప్రభుత్వమని చెప్పుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రాబంధుల్లా పీక్కు తింటుందని… వరినాట్లు వేశాక యూరియా ఇవ్వకుండా రైతులను ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందని ఇప్పుడు చేతికొచ్చిన పంటను అమ్ముకుందామని కొనుగోలు కేంద్రాల్లో పోస్తే ధాన్యం కొనేదిక్కు లేక రైతులు బిక్కటిల్లి పోతున్నారన్నారని, రైతుల ఉసురు పోసుకుంటే ప్రభుత్వ పతనం తప్పదన్నారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుభీమా ద్వారా రైతు మరణిస్తే అతడి కుటుంబానికి రూ.5లక్షల సహాయం అందించేవారని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు భీమాను తొలగించారని అన్నారు. దీనికి ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ బాధ్యత వహించి ప్రభుత్వం నుంచి రైతు ఐలయ్య కుటుంబానికి ప్రభుత్వం కోటి రూపాయల ఎక్స్ గ్రేషియా అందించాలని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆర్భాటంగా కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి చేతులు దులుపుకుంటున్నాడని.. మానకొండూర్ నియోజకవర్గ వ్యాప్తంగా ఏ గ్రామంలో చూసినా ధాన్యం తూకం వేయకుండా ఎక్కడి ధాన్యం అక్కడే పెరుకుపోతుందన్నారు. ఒక వేళ తూకం వేసినా లారీలు రాక మిల్లులు అలాట్ మెంట్ లేక ధాన్యం బస్తాలు పోవడం లేదన్నారు.
రైతులు ఆరుగాలం శ్రమించి పండించిన పంట కల్లాల్లోనే ఉండటంతో రైతులు ఆవేదన చెంది గుండెపోటుతో మరణిస్తున్నారని.. గద్దపాక గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన రైతు కొయ్యడ ఐలయ్య మృతికి స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. ఎద్దు ఏడ్చిన చోట ఎవుసం నిలువదు…రైతు ఏడ్చిన చోట రాజ్యం నిలువదని.. రైతులను కన్నీరు పెట్టిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం పతనం దగ్గర్లోనే ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బేషరతుగా ధాన్యం తూకాలు వేగవంతంగా వేసి లారీలతో ధాన్యం బస్తాలు మిల్లులకు తరలించాలని డిమాండ్ చేశారు.