సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 24 : రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు(RTC bus) ఢీ కొని యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన తంగళ్లపల్లి మండలం సారంపల్లిలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. సారంపల్లిలోని సిరిసిల్ల- సిద్దిపేట రహదారిపై సిరిసిల్ల నుండి హైదరాబాద్ వెళుతున్న ఆర్టీసీ బస్సు మార్గమధ్యంలో సారంపల్లి చౌరస్తాలో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీ కొట్టింది.
ఈప్రమాదంలో బైక్ పై ఉన్న ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన ప్రశాంత్ (18) యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సు పైనుంచి వెళ్లడంతో తల పగిలి ఘటన స్థలంలో మృతిచెందాడు. బైక్ పై ఉన్న మరొక యువకుడికి తీవ్ర గాయాలయాయి. గాయపడ్డ యువకుడిని స్థానికులు దవాఖానకు తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.