సిరిసిల్ల : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానిక వార్డుల ప్రజలను, పట్టణ ప్రజలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఇప్పటికే అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. మున్సిపల్ ఎన్నికల కోసం మరోసారి అబద్ధాలు చెబతోందని విమర్శించారు. కాంగ్రెస్ మాటలు నమ్మి ఓటు వేస్తే మరోసారి మోసపోయినట్లు అవుతుందని చెప్పారు.
కేటీఆర్ ఇంకా ఏమన్నారో ఆయన మాటల్లోనే.. ‘మున్సిపల్ ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతుబంధు వేస్తానని చెబుతున్నారు. కానీ ఇప్పటికీ ఎన్ని పంట కాలాలు గడిచాయి..? ఎన్నిసార్లు రైతుబంధు వేసిండో చెప్పాలి. రైతుబంధు రైతన్నల ఖాతాలో వేయడానికి ముఖ్యమంత్రికి మున్సిపల్ ఎన్నికలు ఏ విధంగా అడ్డు వస్తున్నాయి? కేవలం ఎన్నికలు అయిపోయేంత వరకు ఆశ చూపించి, మరొకసారి మోసం చేయడానికే రేవంత్ రెడ్డి ఈ మాట చెబుతున్నారు. అడ్డగోలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి కార్యక్రమాలను కూడా పక్కన పెట్టారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అందరినీ మోసం చేస్తున్నది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మళ్లీ కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఓటువేస్తే.. మళ్లీ మోసపోవడం ఖాయం’ అని కేటీఆర్ అన్నారు.
‘ముఖ్యమంత్రికి చేతిలో అధికారం, అవకాశం ఉన్నప్పుడు మాజీ సీఎం కేసీఆర్ను తిట్టవలసిన అవసరం ఏమున్నది? చేతనైతే ప్రజలకు మంచి చేయాలి, ఇచ్చిన హామీలు అమలు చేయాలి. కానీ కేసీఆర్ను తిట్టవలసిన అవసరం ఏముంది..? ప్రతి అంశంలో అడ్డగోలుగా మాట్లాడటం, అబద్ధాలు ఆడటం తప్పించి, ఈ రెండేళ్ళలో ఒక్కటంటే ఒక్క మంచి పని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేదు. కేసీఆర్ ఏర్పాటు చేసిన చిన్న జిల్లాలను తీసివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నుతున్నది. ఈ ఎన్నికల్లో జిల్లా కేంద్రాలను రద్దు చేస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ మాటలు చూసి ఓటు వేయాలి. జిల్లాలు ఎత్తివేస్తామని చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి ఓటువేస్తే అది మంచా, చెడా అన్న విషయాన్ని గుర్తించి ఓటు వేయాలి’ అని కేటీఆర్ సూచించారు.
ఈ మున్సిపల్ ఎన్నికల్లో ప్రధాన పోటీ గత పదేళ్లలో ప్రజల కోసం అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన బీఆర్ఎస్ పార్టీకి, గడిచిన రెండేళ్లలో ఉన్న సంక్షేమ పథకాలను ఎత్తివేసిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్నదని కేటీఆర్ చెప్పారు. మరోసారి కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేస్తేనే తగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు తిరిగి ప్రారంభమవుతాయని, ఆ దిశగా ఈ మున్సిపల్ ఎన్నికలతోనే కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేసుకునే కార్యక్రమం ప్రారంభించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీని గనుక ఈ మున్సిపల్ ఎన్నికల్లో నిలదీయకుంటే, ఇచ్చిన హామీల మోసంపైన ప్రశ్నించకుంటే, మరో మూడు సంవత్సరాల దాకా అంటే శాసనసభ ఎన్నికల వరకు ప్రజలకి ప్రభుత్వాన్ని, కాంగ్రెస్ పార్టీని ప్రశ్నించే అధికారం, అవకాశం రాదని చెప్పారు. ఇప్పుడు గనుక ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేసేలా సురుకు పెట్టకుంటే కాంగ్రెస్ పార్టీ తన మోసాలను కొనసాగిస్తుందని అన్నారు.