Minister KTR | రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 9 (నమస్తే తెలంగాణ)/తెలంగాణ చౌక్: సిరిసిల్ల ఎడ్యుకేషన్ హబ్‌గా మారింది. మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో ఇది సాధ్యమైంది. రాష్ట్రంలోనే తొలి కేజీ టు పీజీ క్యాంపస్, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, మెడికల్, నర్సింగ్ కళాశాలలు, రాష్ట్రంలోనే తొలి ఫైన్ ఆర్ట్స్ కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కూడా అందుబాటులోకి వచ్చాయి. 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా రాజన్న సిరిసిల్ల జిల్లాకు 2018లో వ్యవసాయ కళాశాల మంజూరైంది. తాత్కాలికంగా సర్ధాపూర్లో తరగతులు కొనసాగుతుండగా, తంగళ్లపల్లి మండలంలోని జిల్లెల్ల శివారులో 35 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో రూ.69.50 కోట్లతో సకల వసతులతో ప్రత్యేక భవనాన్ని నిర్మించారు. విద్యార్థుల సౌకర్యార్థం 16 ఎకరాల్లో జీ ప్లస్ 2 పద్ధతిలో కళాశాల భవనం, విద్యార్థిని, విద్యార్థులకు వేర్వేరు హాస్టళ్లు, 19 ఎకరాల్లో వ్యవసాయ పరిశోధన క్షేత్రం, ఫాంలాండ్స్‌ను నిర్మించారు. అత్యాధునిక వసతులతో కూడిన కంప్యూటర్ ల్యాబ్‌లు, ప్రయోగశాలలు, సెమినార్ హాళ్లు, అధ్యాపకుల గదులు, అసోసియేషన్ డీన్ చాంబర్, మాడ్రన్ లైబ్రరీని ఏర్పాటు చేశారు. నిర్మాణం పూర్తి కావడంతో ఈ నెల 12న మంత్రులు కేటీఆర్, నిరంజన్‌రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నది.
బీఎస్సీ (ఆనర్స్) విభాగంలో నాలుగు సంవత్సరాల పాటు వ్యవసాయ డిగ్రీ అందిస్తున్నది. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయ రంగంలో సాంకేతిక విద్య నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నది. ఈ కళాశాలలో పీజీటీఎస్‌ఏసీ ఆధ్వర్యంలో ఎంసెట్ ద్వారా విద్యార్థుల అడ్మిషన్లు జరుగుతున్నాయి. మొదటి బ్యాచ్‌లో 56 మంది అడ్మిషన్ పొందగా వారు 2022 ఆగస్టులో వ్యవసాయ డిగ్రీలో పట్టభద్రులయ్యారు. ప్రస్తుతం బీఎస్సీ అగ్రికల్చరల్‌లో మొత్తం 190 మంది విద్యార్థులు ఉన్నారు. రానున్న రోజుల్లో నూతన భవనంలోకి మార్చిన తరువాత మరిన్ని కోర్సులతోపాటు ప్రతి విభాగంలో 120 సీట్లకు అప్‌గ్రేడ్ చేయనున్నారు. ప్రస్తుతం 23 మంది బోధన, 19 మంది బోధనేతర సిబ్బంది ఈ డిగ్రీ కళాశాలలో సేవలు అందిస్తున్నారు.
2015-16 విద్యా సంవత్సరంలో ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి అనుబంధంగా సర్ధాపూర్లో వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల అందుబాటులోకి వచ్చింది. ఇది రెండేండ్ల కోర్సు. 60 మంది విద్యార్థులకు ప్రత్యేక హాస్టల్ వసతి, డిజిటల్ ల్యాబ్, అధునాతన లైబ్రరీతో 2018-19 సంవత్సరం వరకు తరగతులు నిర్వహించారు. ప్రస్తుతం ఈ కళాశాల భవనంలో వ్యవసాయ డిగ్రీ కళాశాల నిర్వహిస్తుండటంతో దీన్ని సిద్దిపేట జిల్లాకు మార్చారు. వచ్చే ఏడాది నుంచి సిరిసిల్లలోనే తరగతులు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.
ఒకప్పుడు విద్యారంగంలో అనేక సమస్యలతో కొట్టుమిట్టాడిన సిరిసిల్ల.. మంత్రి కేటీఆర్ చొరవతో ప్రత్యేక జిల్లా సిద్ధించాక విద్యారంగంలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచింది. సకల సౌకర్యాలతో కూడిన ప్రాథమిక విద్య నుంచి డిగ్రీ వరకు, ఉపాధినిచ్చే వృత్తి విద్యలోనూ విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు భరోసానిస్తూ సిరిసిల్లను ఎడ్యుకేషన్ హబ్‌గా తీర్చిదిద్దారు. మానేటి గడ్డను విద్యాహారంగా మార్చి రాష్ట్రంలోనే అగ్రగామిగా నిలిపారు. అత్యాధునిక వసతులతో కూడిన నూతన భవనాలు, ఉన్నత విద్యతోపాటు సాంకేతిక, వ్యవసాయ, వైద్య, వృత్తి విద్య కళాశాలలు మంత్రి కేటీఆర్ చొరవతో అందుబాటులోకి వచ్చాయి. రాష్ట్రంలోనే తొలి కేజీ టు పీజీ క్యాంపస్, గురుకులాలు, కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, వ్యవసాయ పాలిటెక్నిక్, వ్యవసాయ కళాశాల, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, మెడికల్, నర్సింగ్ కళాశాలలు, రాష్ట్రంలోనే తొలి ఫైన్ ఆర్ట్స్ కళాశాల, ఇంటర్నేషనల్ డ్రైవింగ్ స్కూల్ కూడా అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే.