Mamata Banerjee : పశ్చిమ బెంగాల్లో ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా సాగబోతున్నాయి. అధికార పార్టీ అధ్యక్షురాలు, సీఎం మమతా బెనర్జీ, ప్రతిపక్ష నేత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సువేందు అధికారి మరోసారి ఒకే స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఇద్దరూ దక్షిణ కోల్కతాలోని బబానిపూర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ప్రస్తుతం మమత, బబానిపూర్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఇద్దరూ 2021లో జరిగిన ఎన్నికల్లో నందిగ్రామ్ నుంచి పోటీపడగా.. సువేందు ఎమ్మెల్యేగా గెలుపొందారు.
మమతా బెనర్జీ 2,000 ఓట్ల తేడాతో ఓడిపోయారు. దీంతో ఈసారి కూడా ఇద్దరూ ఒకేస్థానం నుంచి పోటీ పడబోతుండటం ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్యర్థుల ప్రకటనపై దృష్టి పెట్టాయి. అధికార టీఎంసీ మంగళవారం 294 అసెంబ్లీ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. పార్టీ అధ్యక్షురాలు మమత, టీఎంసీ జనరల్ సెక్రెటరీ, లోక్సభ ఎంపీ అభిషేక్ బెనర్జీ కలిసి కోల్కతాలో మంగళవారం సాయంత్రం అభ్యర్థుల్ని ప్రకటించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీలో 294 సీట్లున్నాయి. దీంతో మొత్తం స్థానాలకు టీఎంసీ అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. ఇందులో 52 మంది మహిళలున్నారు. 95 మంది ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులున్నారు. బెంగాల్లో ఏప్రిల్ 23, 29 తేదీలలో, రెండు దశల్లో ఎన్నికలు జరుగుతాయి.
ఈ సీజన్లో జరగనున్న ఎన్నికల్లో చివరి దశ ఎలక్షన్ బెంగాల్లోనే. మే 4న ఫలితాలు వెల్లడిస్తారు. ఈసారి ఎలాగైనా బెంగాల్లో అధికారం దక్కించుకోవాలని బీజేపీ ప్రయత్నిస్తుంటే.. వరుసగా నాలుగోసారి అధికారం చేపట్టాలని టీఎంసీ పట్టుదలతో ఉంది. మమత పోటీ చేస్తున్న బబానిపూర్ ఆమెకు కంచుకోటలాంటిది. మమత ఇక్కడ 2011 నుంచి వరుసగా గెలుస్తూనే ఉన్నారు. 2021లో నందిగ్రామ్ నియోజకవర్గంలో సువేందు చేతిలో ఓడిపోయిన తర్వాత మళ్లీ బబానిపూర్ అసెంబ్లీకి జరిగిన ఉప ఎన్నికలో గెలిచారు.