– జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలి
– సిఐటియు నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండి సలీం
– కలెక్టరేట్ వద్ద మహాధర్నా
నల్లగొండ, మార్చి 17 : అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్సిడ్ వేతనం, నిర్ణయించాలని, అలాగే జనవరి, ఫిబ్రవరి రెండు నెలల పారితోషికాలు వెంటనే చెల్లించాలని సిఐటియు నల్లగొండ జిల్లా కార్యదర్శి ఎండి సలీం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సలీం మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో సుమారు 28 వేల మంది ఆశా వర్కర్లు గత 20 సంవత్సరాల నుండి పేద ప్రజలకు ఆరోగ్య సేవలందిస్తున్నారని, వీరంతా మహిళలు, బడుగు, బలహీన వర్గాలకు చెందిన వారే అత్యధికులున్నట్లు తెలిపారు. నేటికి వీరికి ఎలాంటి చట్టబద్ధ సౌకర్యాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. కనీసం గ్యారెంటీ ఫిక్సిడ్ వేతనం కూడా ఇప్పటివరకు నిర్ణయం చేయలేదన్నారు. ఆశా వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు 15 రోజులు రాష్ట్ర వ్యాప్తంగా ఆశా వర్కర్లు నిరవధిక సమ్మె చేశారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అనంతరం వచ్చిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ప్రస్తుత కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటింది. ఈ కాలంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక హామీలు ఇచ్చింది. అయినా నేటికి వేతనాలు పెంచలేదు. రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50 వేల మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ తదితర హామీలు ఇచ్చినా, ఇంకా అమలు చేయడం లేదు. పి.ఆర్.సి. ఎరియర్స్, లెప్రసీ, పల్సేపోలియో, ఎలక్షన్ డ్యూటీ డబ్బులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉంటున్నాయి. వీటికి తోడు పారితోషికాలు కూడా ప్రతి నెలా రావడం లేదు. దీంతో ఆశా వర్కర్లు అనేక ఆర్ధిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నారని ఇంకా అనేక సమస్యలు పెండింగ్లో ఉన్నట్లు వెల్లడించారు. వీటన్నింటినీ పరిష్కరించే విధంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఎన్హెచ్ఎంకు నిధులు పెంచి ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

‘ఆశా వర్కర్లకు రూ.18 వేల వేతనం నిర్ణయించాలి’
ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మహేశ్వరి, వెంకటమ్మ మాట్లాడుతూ.. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఆశా వర్కర్లకు రూ.18 వేల ఫిక్స్డ్ వేతనం నిర్ణయించి నిధులు కేటాయించాలని, ఆశాలకు కేంద్ర ప్రభుత్వం పెంచిన రూ.1500/-ల పారితోషికాలను వెంటనే అమలు చేయాలన్నారు. 2021 జూలై నుండి డిసెంబర్ వరకు 6 నెలల పి.ఆర్.సి. ఎరియర్స్ వెంటనే చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. పి.ఎఫ్., ఇ.ఎస్.ఐ., సౌకర్యం, ఉద్యోగ భద్రత కల్పించాలని,ఎ.ఎన్.ఎం. జి.ఎన్.ఎం. ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశా వర్కర్లకు ప్రమోషన్ సౌకర్యం వెంటనే నిర్ణయించాలని డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆదివారం, పండుగలకు సెలవులు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ఎ.ఎన్.సి., పి.ఎన్.సి. తదితర టార్గెట్ లను రద్దు చేస్తూ సర్క్యులర్ జారీ చేయాలని కోరారు.
రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.5 లక్షలు చెల్లించాలి. ఇస్తున్న పారితోషికాల్లో సగం పెన్షన్ నిర్ణయించాలని, సంవత్సరానికి 20 రోజులు వేతనంతో కూడిన క్యాజువల్ సెలవులు, 6 నెలలు వేతనంతో కూడిన మెడికల్ సెలవులివ్వాలని,గతంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఆశాలతో NCD ఆన్లైన్ పని చేయించకూడదు. స్పూటమ్ డబ్బాలు మోయించకూడదు. పూనమ్ క్లాత్ కూడిన క్వాలిటీ యూనిఫాం సప్లై చేయాలి. ఆశాలు చేస్తున్న పారితోషికం లేని పనులన్నింటిని గుర్తించాలి. ప్రభుత్వ అన్ని ఆస్పత్రుల్లో ఆశాలకు ప్రత్యేకంగా రెస్టు రూమ్లు ఏర్పాటు చేయాలి. ఆశాలకు పనిభారం తగ్గించాలి. పారితోషికం లేని పనులు చేయించకూడదు. ఆశాలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని అమలు చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు చింతపల్లి బయన్న, లకపాక రాజు, సహాయ కార్యదర్శి పెంజర్ల సైదులు, అవుట రవీందర్, యూనియన్ జిల్లా కమిటీ సభ్యులు కవిత, శైలు, పార్వతమ్మ, జానకి, నవనీత, సైదమ్మ, ప్రేమలత, వీరభద్రమ్మ, సిఐటియు జిల్లా కమిటీ సభ్యులు ఆదిమల్ల సుధీర్, గంజి రాజేశ్, సిహెచ్ అనురాధ పాల్గొన్నారు.