ఖమ్మం, జూలై 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొద్ది రోజులుగా వర్షాలు కురుస్తుండడంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దీంతో అనేకమంది ప్రజలు సీజనల్ వ్యాధుల భారిన పడుతున్నారు. వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రుల్లో బారులు తీరుతున్నారు. జలుబు, జ్వరం, వైరల్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్న వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఖమ్మం, కొత్తగూడెం జిల్లా కేంద్ర ఆసుపత్రులు సహా భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు, కల్లూరు, మధిర, వైరా, పెనుబల్లి, మణుగూరు వంటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రులకు నిత్యం వందల సంఖ్యలో జ్వరపీడితులు చికిత్స కోసం వస్తున్నారు.
గత వారం రోజులుగా ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ, పెద్ద ఆసుపత్రుల్లోనూ రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఓపీ విభాగంలో తీవ్ర రద్దీ నెలకొంటోంది. సాధారణంగా 1,000 నుంచి 1,200 రోజువారీ ఓపీ ఉండే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈమధ్య ఒక్కసారిగా 1,500 నుంచి 1,700 వరకు పెరుగుతుండడంతో జిల్లాలో సీజనల్ వ్యాధుల ప్రభావం ఏమేరకు ఉందో అవగతమవుతోంది. ఒక్కోరోజు 1,700కు మించి కూడా ఔట్ పేషెంట్లు (ఓపీ) నమోదు చేసుకుంటుండడం.. సీజనల్ వ్యాధుల తీవ్రతకు కారణంగా కన్పిస్తున్నాయి. ప్రధానంగా జ్వరపీడితులు అధికంగా ఉంటున్నారు.
ఇటీవల కాలంలో ప్రతి రోజూ ఉదయం ఆసుపత్రుల్లో ఓపీ సేవలు ప్రారంభమయ్యే సమయానికంటే ముందుగానే రోగులు వచ్చి క్యూ కడుతున్నారు. వైద్యులను కలిసేందుకు, పరీక్షలు చేయించుకునేందుకు గంటల తరబడి వేచి ఉంటున్నారు. అన్ని ప్రధాన ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది.

ప్రధానంగా వైరల్ ఇన్ఫెక్షన్తో ఎక్కువ సంఖ్యలో ప్రజలు ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నది. జిల్లాలో వాతావరణ మార్పులు చోటుచేసుకోవడంతో ప్రభుత్వం అన్ని గ్రామాలు, పట్టణాల్లోనూ పారిశుధ్య నివారణపై దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు. చిన్న చినుకు వస్తే ప్రధాన వీధులతో సహా అనేక వీధుల్లో పారిశుధ్యం తాండవిస్తోంది.
దీంతోపాటు దోమలవ్యాప్తి సైతం విస్తృతంగా పెరుగుతోంది. వ్యాధుల వ్యాప్తిని అరికట్టేందుకు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే మార్గమని వైద్యులు చెబుతున్నారు. అవసరాల కోసం ఇంటి పరిసరాల్లో సిమెంటు కుండీల్లో నీరు నిల్వ చేస్తుంటారని అన్నారు. అయితే, ప్రస్తుత సీజన్లో అది సరికాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కుండీల్లో, ఇతర పాత్రల్లో నిల్వనీరు మూడు రోజుల్లో తీసివేయకపోతే వాటిలో దోమలు గుడ్లు పెట్టే ప్రమాదం ఉందని వైద్యులు చెప్తున్నారు. అవి వృద్ధి చెంది మలేరియా, డెంగీ, చికున్‌గున్యా వంటి వ్యాధులకు కారణమవుతాయంటున్నారు.
కూలరు, పాత టైర్లు, కొబ్బరిబొండాల్లో నీరు నిల్వ ఉన్నా.. దోమలు వృద్ధిచెందే ప్రమాదం ఉంది. అయితే, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య చికిత్సలు పొందడానికి రోగులు బారులు తీరడంతో రద్దీ పెరుగుతోంది. వైద్యసిబ్బంది తక్కువగా ఉన్న ప్రాంతాల్లో రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రభుత్వ హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. పరిశుభ్రమైన ఆహారం, తాగునీటితోపాటు అన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే సీజనల్ వ్యాధులు సంక్రమించే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. వాతావరణ మార్పుల వల్ల జ్వరం, దగ్గు, జలుబు, వాంతులు, విరేచనాల బారిన పడేవారి సంఖ్య జిల్లాలోని అన్ని ప్రాంతాల్లోనూ పెరుగుతోంది. సీజనల్ వ్యాధులను దృష్టిలో ఉంచుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మున్సిపాలిటీ, గ్రామ పంచాయతీల పరిధిలో పారిశుధ్య నివారణ చర్యలు మరింత పకడ్బందీగా చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.