సిటీబ్యూరో, జూలై 29(నమస్తే తెలంగాణ) : మేడ్చల్ ప్రాంతానికి మెట్రో రైలు సదుపాయాన్ని పొడిగించాలనే డిమాండ్‌తో మేడ్చల్ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో భారీ పాదయాత్రకు పిలుపునిచ్చారు. తమకు మెట్రో విలాసవంతమైనది కాదు.. ఇక్కడి ప్రజలకు అత్యంత అవసరమంటూ ఈ కార్యక్రమానికి చేపడుతున్నారు. ఆగస్టు 2 నుంచి ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం జీడిమెట్లలోని గాంధీ విగ్రహం వద్ద ప్రారంభమై, జేబీఎస్ మెట్రో హబ్ వరకు కొనసాగనుంది.
నిత్యం ట్రాఫిక్ సమస్యలతో ఇబ్బందిపడుతున్న ప్రయాణికులకు మెట్రో నిర్మాణం ద్వారా శాశ్వత పరిష్కారం చూపడం, సొంత వాహనాల వాడకం తగ్గించి వాతావరణ కాలుష్యాన్ని నియంత్రించడం, మెట్రో ద్వారా సమయం ఆదా అవడంతోపాటు రోడ్డు ప్రమాదాలను అరికట్టే వీలున్నా… మెట్రో నిర్మాణం ఈ ప్రాంతానికి అత్యంత కీలకమని సాధన సమితి సభ్యులు వ్యాఖ్యానించారు. ప్రతి వీకెండ్లో ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుందని, నార్త్ సిటీ ప్రయోజనాలపై పాలకులు దృష్టి పెట్టేంత వరకు నిరసన కార్యక్రమాలు ఉంటాయని సాధన సమితి నిర్వాహకులు తెలిపారు.