గద్వాల, జూలై 29 : ఎట్టకేలకు కాంగ్రెస్ సర్కారు దిగొచ్చింది. సాగు, తాగునీటి విషయంలో చేతులేత్తేయడంతో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు అందరూ ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో ప్రభుత్వంలో కదలిక వచ్చింది. బుధవారం జూరాల ప్రాజెక్టు కుడి, ఎడమ కాల్వలకు నీటిని విడుదల చేయడంతోపాటు లిఫ్ట్‌లు ఆన్ చేశారు. దీం తో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎల్‌నినోను సాకుగా చూపి.. పీజేపీకి వచ్చిన నీటిని వచ్చినట్లు విద్యుదుత్పత్తి పేరుతో దిగువకు విడుదల చేసింది. నడిగడ్డను ఎండగొట్టడానికి ప్రయత్నించింది. ఈ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘క్యాబినెట్ తీర్మానిస్తేనే నీళ్లు ఇస్తాం..’, ‘ఏపీకి నీళ్లు.. నడిగడ్డకు కన్నీళ్లు’, ‘సాగునీటి విడుదలలో జాప్యం ఎందుకో’? అన్న కథనాలు ప్రచురితమయ్యా యి.
దీనికితోడు ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ నేత లు ప్రాజెక్టుల బాట పట్టడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. నీటి వి డుదల విషయంలో నడిగడ్డ నేత తనకు రైతులపై ప్రేమ ఉందని నిరూపించుకునే ప్రయత్న లో భాగంగా తాగు, సాగునీటి విషయంలో నడిగడ్డకు ప్రభుత్వం అన్యాయం చేస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం చేయించినట్లు తెలిసింది. నీటి విడుదల చేయకపోతే ఆందోళనతోపాటు కలెక్టరేట్ ముట్టడి చేస్తామని చెప్పిన సదరు నేత రాత్రి వరకు కలెక్టరేట్ ముట్టడి లేదని చెప్పడంపై ప్రతిపక్షాలు పెదవి విరుస్తున్నాయి. రైతుల నుంచి మార్కులు కొ ట్టేయడానికే అలా డ్రామా లు ఆడినట్లు విమర్శించాయి. ఏది ఏమై నా ప్రభుత్వం రైతుల ఆగ్రహానికి గురి కాకుండా నీరు కాల్వకు విడుదల చేయడంతో రైతులకు ఊరట లభించింది.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రాజెక్టుల బాట పట్టడంతో కాంగ్రెస్ ప్రభుత్వంలో వణుకు మొదలైంది. కర్ణాటకలోని ప్రాజెక్టులను పరిశీలించిన ఉమ్మడి పాలమూరు బీఆర్ఎస్ నేతల అక్కడ వాస్తవ పరిస్థితులను పరిశీలించి కర్ణాటకలో నిండుగా.. తెలంగాణను ఎండబెట్టే ప్రయ త్నం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను బయటపెట్టడంతో ప్రభుత్వం దిగి రాక తప్పలేదు. ఎగువ నుంచి వరద వస్తున్నా జూరాల ప్రాజెక్టు పరిధిలో ఉన్న నెట్టెంపాడ్, భీమా ఫేస్ -1, ఫేస్-2, కోయిల్‌సాగర్, జూరాల కుడి, ఎడమ, సమాంతర కాల్వలతోపాటు లిఫ్ట్‌ల ద్వారా నీటిని పంపింగ్ ప్రారంభించలేదు.
విద్యుదుత్పత్తి పేరుతో మూడ్రోజులుగా లక్షకుపైగా క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తుండ డం కుట్రలో భాగమే అని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకులు బుధవారం జూరాల పరిధిలో అన్ని కాల్వలతో పాటు లిఫ్ట్‌లకు నీటిని విడుదల చేయాలన్న డిమాండ్‌తో ఆందోళనకు సిద్ధమవుతున్న తరుణంలో ప్రభుత్వం దిగొచ్చింది. నీటిని విడుదల చేయకపోతే రైతుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని భావించి విధిలేని పరిస్థితిలో నీటిని విడుదల చేసింది.
ఓ వైపు ప్రభుత్వ తీరును రైతులు ఎండగడుతున్నా, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు నీటి విషయంలో నడిగడ్డతోపాటు ఉమ్మడి పాలమూరు జిల్లాకు అన్యాయం జరుగుతుందని మొత్తుకుంటున్నా.. ప్రభుత్వం మాత్రం విద్యుదుత్పత్తి పేరుతో దిగువకు 27,199 క్యూసెక్కులు విడుదల చేస్తుంది. జూరాలకు ఎగువ నుంచి 21 వేల క్యూసెక్కులు రాగా.. విద్యుదుత్పత్తికి 27,199 క్యూసెక్కులు విడుదల చేస్తూ అధికారులు, పాలకులు ఆంధ్రా ప్రాంతంపై త మకున్న ప్రేమను చాటుకుంటున్నారు.
రైతుల, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఒత్తిడి తట్టుకోలేక ఎట్టకేలకు బుధవారం అధికారులు లిఫ్ట్ లు, కాల్వలకు నీటిని విడుదల చేశారు. జూరా ల ప్రాజెక్టుకు 21వేల వరద వస్తుండగా ప్రాజెక్టు నుంచి నెట్టెంపాడ్ లిఫ్ట్‌కు 1500క్యూసెక్కులు, భీమా-లిఫ్ట్1కు 1300 క్యూసెక్కులు, భీమా లిఫ్ట్-2కు 750 క్యూసెక్కులు, కోయిల్‌సాగర్‌కు 630క్యూసెక్కులు, జూరాల ఎడమ కాల్వకు 1030 క్యూసెక్కులు, కుడి కాల్వకు 500క్యూసెక్కులు, సమాంతర కాల్వకు 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
గద్వాల ఎమ్మెల్యే డ్రామా ఆర్టిస్టుగా మారాడని బీజేపీ జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ధారెడ్డి పత్రిక ప్రకటనలో ఆరోపించారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా ఒక్క కాల్వ పనులు మరమ్మతులు చేయించలేదని, ప్రస్తుతం రైతుల గురించి మాట్లాడకపోతే తమకు ఉనికి ఉండదని భావించి నీరు విడుదల చేయకపోతే ధర్నా చేస్తామనే నాటకానికి తెరలేపారని విమర్శించారు. రైతులపై ప్రేమతో ఎమ్మెల్యే ఆందోళనకు సిద్ధం కాలేదని.. పదవి కోసం చేస్తున్నాడని మండిపడ్డారు. సొంత పార్టీపై ధర్నాకు దిగితే ప్రజల కోసం కొట్లాడుతున్నా.. అనిపించుకోడానికే తప్పా వేరే లేదన్నారు. ఎమ్మెల్యే డ్రామాలు ప్రజలు గమనిస్తున్నారని ఆమె పేర్కొన్నారు.