Liver Transplantation | సిరిసిల్ల టౌన్, జూన్ 18: మూడేళ్ల చిన్నారి లివర్ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. తోటి మిత్రులతో ఆడుతూ సరదాగా ఉండాల్సిన వయసులో ఆసుపత్రి బెడ్ పై అవసానస్థితిలో ఉన్న కొడుకును చూస్తూ తల్లిదండ్రులు దేవుడా నువ్వే మా కొడుకును కాపాడాలంటూ తల్లడిల్లుతున్నారు. చిన్నారికి ఖరీదైన వైద్యం అవసరమని వైద్యులు తెలపడంతో నెలసరి జీతంతో కుటుంబం వెళ్లదీస్తున్న తండ్రి రాజశేఖర్ దిక్కుతోచని స్థితిలో ఉన్నాడు. మానవతామూర్తులు ఎవరైనా ముందుకు వచ్చి తన కొడుకు వైద్యానికి సాయం అందించాలని కోరుతున్నాడు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బివైనగర్‌కు చెందిన గూడూరి రాజశేఖర్- సంజన దంపతులకు కొడుకు మనీష్ ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం మనీష్ అస్వస్థతకు గురవడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు పరీక్షలు చేసిన అనంతరం జాండీస్ అయ్యాయని, లివర్ పూర్తిగా డ్యామేజ్ అయినట్లు తెలిపారు. చిన్నారి ఆరోగ్యంగా ఉండాలంటే లివర్ ప్లాంటేషన్ తప్పనిసరి అని చెప్పారు. దీని కోసం రూ.25లక్షల వరకు వైద్య ఖర్చులు అవుతాయని అన్నారు.
ఓ ఏజెన్సీలో నెలసరి జీతంతో పని చేస్తున్న రాజశేఖర్ కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా మారింది. ఈ పరిస్థితులలో తన కొడుకుకు ఇంత ఖరీదైన వైద్యం చేయించలేని స్థితిలో ఉన్నాడు. ఇప్పటికే దాదాపు రూ.4 లక్షల వరకు అప్పలు చేసి వైద్యం చేయించాడు. మనీష్ ప్రస్తుతం హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని తెలిపారు.
నిరుపేద నేత కార్మిక కుటుంబానికి చెందిన రాజశేఖర్ తన కొడుకుకు వచ్చిన వ్యాధిని నయం చేసుకునేందుకు తల్లడిల్లుతున్నాడు. ఖరీదైన వైద్యం చేయించేందుకు స్థోమతలేక దేవుడిపై భారం వేశాడు. మానవతా దృక్పదంతో ఎవరైనా మానవతామూర్తులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి తన కొడుకు వైద్యానికి సాయం అందించాలని వేడుకుంటున్నాడు. సాయం చేయదలచిన వారు మొబైల్ నంబర్ ఫోన్ పే, గూగూల్ పే 9441161257 ద్వారా అందించాలని కోరుతున్నాడు.
Chiranjeevi | డ్రిల్ మాస్టర్ శివశంకర్‌గా చిరంజీవి.. కామెడీకి పొట్ట చెక్కలవ్వాల్సిందే..!
Jogulamba Gadwal | గద్వాలలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్