రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 17 (నమస్తేతెలంగాణ) : వందలాదిమంది పోలీసు పహరా మధ్య, విధివిధానలు పాటించకుండా ఎన్పీడీసీఎల్ ” సెస్ ” సంస్థను స్వాధీనం చేసుకోవడం అక్రమమని, లాభాల్లో ఉన్న సంస్థను రూ.30 వేల కోట్ల నష్టాలున్న ఎన్పీడీసీఎల్లో విలీనం చేయడం దారుణమని సిరిసిల్ల సహకారం విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) చైర్మన్ చిక్కాల రామారావు ఆరోపించారు. శుక్రవారం సెస్ సంస్థలోని తన చాంబర్లో డైరెక్టర్లతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. సెస్ సంస్థను కుట్రపూరితంగా స్వాధీనం చేసుకున్నారని పేర్కొన్న ఎన్పీడీసీఎల్ హస్తగతం చేసుకున్న పరిస్థితులను వివరించారు.
ఏప్రిల్1 వ తేదీన పోలీసు బలగాలు స్థానిక పోలీసుల సహకారంతో సెస్ సంస్థను చుట్టుముట్టి స్వాధీనం చేసుకున్నారని, తాము వివరణ కోరితే పైనుండి ఆదేశాలు ఉన్నాయని సీఎండి స్పష్టం చేశారని సిరిసిల్ల సహకారం విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) చైర్మన్ చిక్కాల రామారావు వెల్లడించారు. అలాగే సంస్థలోని సీసీ కెమెరాలు తొలగించారని, మరునాడు రహస్యంగా 6,7 నెంబర్ల జీవోలను తీశారని, వాటిని తమకు ఇవ్వలేదని.. తాము నెట్ లో డౌన్లోడ్ చేసుకున్నామని ఆయన తెలిపారు. 3.10 లక్షల మంది వినియోగదారులు, 3.51 లక్షల విద్యుత్ కనెక్షన్లతో కొనసాగుతున్న సంస్థపై అవినీతి మరక అంటిస్తూ.. కొంతమంది ఫిర్యాదుతో సంస్థను స్వాధీనం చేసుకోవడం సరైంది కాదని ఆయన మండిపడ్డారు. ఇది రాజకీయ దురుద్దేశంగా తాము భావిస్తున్నట్టు చైర్మన్ వెల్లడించారు. సెస్ సంస్థను స్వాధీనం చేసుకునేందుకు ఏడాదికాలంగా కుట్రలు జరుగుతున్నాయని, ప్రభుత్వ పెద్దలు పరోక్షంగా హెచ్చరికలు కూడా చేశారని సిరిసిల్ల సహకారం విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) చైర్మన్ చిక్కాల రామారావు అన్నారు.
సెస్ సంస్థలో 2007 నుండి 2010 వరకు జరిగిన కార్యక్రమాలపై విజిలెన్స్ విచారణ జరిపిందని, పాలకవర్గం దుర్వినియోగం చేశారని ఆరోపణలపై 51 ఎంక్వయిరీలు కూడా జరిగాయని సిరిసిల్ల సహకారం విద్యుత్ సరఫరా సంస్థ (సెస్) చైర్మన్ చిక్కాల రామారావు తెలిపారు. దీనిపై ఉమ్మడి కరీంనగర్ జిల్లా జాయింట్ కలెక్టర్, సెస్ పర్సన్ ఇన్ఛార్జ్ అరుణ్ కుమార్ 2012లో విచారణకు ఆదేశించగా.. కృష్ణయ్య కమిషన్ 2013లో జేసీకి నివేదిక సమర్పించింది. అందులో పాలకవర్గం ఎలాంటి దుర్వినియోగానికి పాల్పడలేదని స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. 2010 అక్టోబర్ 26 తర్వాత తాను పదవి నుంచి దిగిపోయానని తర్వాత అల్లాడి రమేష్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వహించగా కృష్ణయ్య రిపోర్టును 16 సంవత్సరాల పాటు దాచి పెట్టారని రామారావు వెల్లడించారు. ఈ విజిలెన్స్ రిపోర్టును ఎందుకు బహిర్గతం చేయలేదని ఆయన ప్రశ్నించారు.
కృష్ణయ్య రిపోర్టు బైలా నిబంధనలు, ఎన్పీడీసీఎల్ గైడ్‌లైన్స్ ప్రకారం పారదర్శక పాలన సాగించినట్లు రిపోర్టు స్పష్టం చేసిందని రామారావు అన్నారు. అయితే రూ.3,08,97,306 వర్క్ ఆర్డర్లను సంస్థ పూర్తి చేయలేదని, దీనిపై 13 మంది ఉద్యోగులు బాధ్యులు అని చెప్పకుండా కేవలం పాలకవర్గంపై అభియోగాలు మోపి.. కుట్రపూరితంగా అవినీతి జరిగిందని సాకు చెబుతున్నారని ఆయన ఆరోపించారు. సెస్ సభ్యుల రూ.7 కోట్ల వాటా ధనం, రూ.400 కోట్ల ఆస్తులతో కూడిన సెస్ సంస్థ సంపన్నంగా ఉందని రామారావు స్పష్టం చేశారు.

మూడు సంవత్సరాల రికార్డులు, విజిలెన్స్ రిపోర్టులు తీసుకెళ్లారని.. రాత్రికి రాత్రే ఎన్పీడీసీఎల్ ద్వారా రైతుల, నేతన్నల, సభ్యుల మనోభావాలు దెబ్బతీసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ దురుద్దేశం కాదా? ఎంతవరకు ఇది న్యాయమో ఆలోచించాలని రైతులను, వినియోగదారులను చైర్మన్ కోరారు. తమ సేవ ఘనమని భావించేలా ఎన్పీడీసీఎల్ అధికారులు 15 రోజుల పాటు అరచేతిలో బెల్లం చూపించి, సినిమా చూపిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. సెస్ సరిహద్దు ప్రాంతాలలో ఎన్పీడీసీఎల్ సేవలు ఎంత అధ్వానంగా ఉన్నాయో, వినియోగదారులు ఎంత దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారో గమనించాలని ఆయన సందర్భంగా కోరారు. లాభాల బాటలో ఉన్న సెస్ సంస్థను నష్టాలలో ఉన్న ఎన్పీడీసీఎల్ సంస్థలో విలీనం చేయడం ఎంతవరకు సమంజసం? అని రామారావు ప్రశ్నించారు.
కొద్దిరోజలుగా ప్రభుత్వ పెద్దలు తమను బెదిరిస్తున్నారని, సంస్థను తొలగిస్తామని భయపెడుతాన్నారని రామారావు పేర్కొన్నారు. తమ పాలకవర్గంపై సీఎం కోపంగా ఉన్నారని ఆయన తెలిపారు. తమ మూడేళ్ల మూడు నెలల పాలల్లో ఎక్కడా అవినీతి జరగలేదని ఆయన చెప్పారు. సంస్థ నష్టాలలో లేదు. ప్రభుత్వమే సబ్సిడీలు ఇవ్వకుండా బకాయిల భారం పెంచింది. ప్రభుత్వం వ్యవసాయ సబ్సిడీలను నెలనెలా ఇవ్వకుండా బకాయిలు పెట్టడం వల్ల ఎన్పీడీసీఎల్ సర్ చార్జీలు వేస్తూ బకాయిల భారం పెంచింది. రూ.680 కోట్లు మనం ఇవ్వాల్సి ఉండగా రూ. 787 కోట్లు సంస్థకు రావాల్సి ఉంది. ఇందులో నష్టం ఎక్కడ ఉంది. ఇప్పటికే సంస్థను లాభాల బాటలో తీసుకువచ్చి శాశ్వత నిర్ణయాలు తీసుకున్నాం. ఉద్యోగులను పనిచేయమంటే పాలకవర్గంపై కోపం వ్యక్తం చేస్తారు. సబ్సిడీ బకాయిలు నెలకు రూ.3.50 రావాల్సి ఉండగా అవి సక్రమంగా చెల్లించకపోవడంతో రూ.24 కోట్లకు ఎస్టీ బిల్లులో కలిపి బాకాయిలు పంపుతారు. రావలసిన బకాయిలపై ఈఆర్సీకి నివేదించాం. దీనిపై రూ. 471 వ్యవసాయ కనెక్షన్ల సబ్సిడీలో రూ.392 కోట్లు మంజూరు చేసి గత మార్చి 30న తమకు ఈఆర్సీ ఇచ్చింది. ఇందులో మా తప్పులు ఎక్కడ ఉన్నాయి అని రామారావు వివరించారు.
2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి హాయంలో సెస్ సంస్థను విలీనం చేశారని, ఆ సమయంలో ఎమ్మెల్యే రాజేశ్వరరావు, మంత్రి జీవన్ రెడ్డితో కలిసి నివేదించగా లాభాల బాటలో ఉన్న సంస్థను విలీనం చర్యను తక్షణమే రద్దు చేశారని చైర్మన్ వెల్లడించారు. ప్రభుత్వ జోక్యం లేకుంటే సంస్థను బ్రహ్మాండంగా నడిపిస్తామని, 13 కోట్ల విద్యుత్ డిమాండ్‌ను 22 కోట్లకు పెంచామని 18 కోట్లు రెవెన్యూ వసూలు చేస్తున్నామని రామారావు తెలిపారు.
సెస్ స్వాధీనాన్ని వ్యతిరేకిస్తూ జరిపే ఉద్యమానికి అన్ని పార్టీలు కలిసి రావాలని రామారావు పిలుపునిచ్చారు. ప్రస్తుతం న్యాయపరంగా పోరాటం చేస్తామని ఇదే ఏకైక మార్గమని, రాజకీయంగా నిర్ణయాలు తమ బీఅర్ఎస్ పార్టీ చూసుకుంటుందని ఆయన తెలిపారు. తమ పాలకవర్గంపై కోపం ఉంటే సెస్ సంస్థకు ఇష్టమైన వారితో కమిటీ వేసి లైసెన్స్ రెన్యూవల్ చేస్తూ యథావిధిగా కొనసాగించాలని, సెస్‌ను కొనసాగిస్తామంటే తమ పాలకవర్గం మూకుమ్మడిగా రాజీనామాలు చేయడానికి సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. రైతులు, నేతన్నలు, పరిశ్రమల అభివృద్ధి కోసం ఈ త్యాగం చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఏప్రిల్ 20 తర్వాత పోరాట పంథాపై నిర్ణయం ప్రకటిస్తామని రామారారు చెప్పారు. సెస్ అందరి సంస్థ అని, అన్ని పార్టీలు రాజకీయాలకు అతీతంగా కలిసి రావాలని సంస్థను, కాపాడుకుందాం అని చిక్కాల కోరారు. 3.10 లక్షల మంది సభ్యులు, 400 కోట్ల ఆస్తులు ఉన్న సంస్థను విలీనం చేయడం సరికాదని, తాము అంగీకరించబోమని ఆయన తేల్చి చెప్పారు. సెస్ సంస్థపై ఫిర్యాదు చేసిన వారు చట్ట విరుద్ధంగా పనులు చేయించుకోవడానికి తమ వద్దకు వస్తే తాము తిరస్కరించామని, ఆ కోపంతో తనపై తప్పుడు ఆరోపణలు తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారని చైర్మన్ ఆరోపించారు.

సెస్ ప్రైవేటీకరణ కోసమే ప్రభుత్వం కుట్రపూరితంగా సంస్థను సహకార సంఘం నుంచి తొలగించి నూరు శాతం ప్రైవేటీకరణ చేయడానికి సిద్ధమవుతోందని ఆయన ధ్వజమెత్తారు. ఈఆర్సీ 17 సర్కిళ్లలో సిరిసిల్ల సెస్‌ను కలిపి 18వ సర్కిల్‌గా నిర్ణయిస్తూ ఇటీవల ఈఆర్సీ నోటిఫికేషన్ జారీ చేసి నెలరోజుల గడువుతో ప్రజాభిప్రాయం కోరిందని రామారావు తెలిపారు. పూర్తి స్థాయిలో సంస్థ విలీనం కాకుండానే ఉద్యోగులను ఎలా బదిలీ చేస్తారు? అని ఆయన ప్రశ్నించారు. దేశంలో 60 ఏళ్ల పాటు పాలించిన పార్టీ సైతం సెస్‌లో అవినీతి అని మాట్లాడడం హాస్యాస్పదంగా ఉందని రామారావు అన్నారు. సంస్థ సేవలను గుర్తిస్తూ అనేక అవార్డులు వచ్చాయని, ఈ సంవత్సరం కూడా అవార్డు వస్తుందనే తపనతో పాలన సాగించామని చైర్మన్ చిక్కాల ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సంస్థ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, డైరెక్టర్లు పాల్గొన్నారు.