రామాయణంలో సీత పాత్రలో నటిస్తున్న సాయి పల్లవి ఎంపికపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. సీత పాత్రకు సాయి పల్లవిని ఎలా తీసుకున్నారంటూ కొందరూ కామెంట్లు చేస్తుండగా.. ఈ చర్చల మధ్య సాయిపల్లవి గతంలో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది. సాంప్రదాయ రూపురేఖల గురించి కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తుండగా, ఆమె నటనకు, సహజ సౌందర్యానికి మరికొందరు మద్దతుగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో తన చిన్ననాటి మొటిమల సమస్య, ఫెయిర్నెస్ క్రీమ్ యాడ్ తిరస్కరించడం గురించి సాయి పల్లవి గతంలో చెప్పిన ఆసక్తికర విషయాలు మళ్లీ చర్చనీయాంశమయ్యాయి.
సినిమాల్లోకి రాకముందు తనకు ఉన్న మొటిమలు, రోసిషియా సమస్య కారణంగా ఎంతో ఆందోళన చెందానని సాయి పల్లవి గతంలో తెలిపారు. ‘ప్రేమమ్’ సినిమా విడుదలకు ముందు నేను ఎన్నో ఫెయిర్నెస్ క్రీమ్లు వాడాను. ముఖంపై మొటిమల వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించాను. నలుగురిలోకి వెళ్లడానికి భయపడేదాన్ని. జనం నా కళ్లను కాకుండా నా మొటిమలనే చూస్తున్నారని బాధపడేదాన్ని అని ఆమె గుర్తుచేసుకున్నారు. అయితే ‘ప్రేమమ్’ చిత్రంతో ప్రేక్షకులు తనను ఉన్నట్లుగానే ఆదరించడంతో తనలో ఆత్మవిశ్వాసం పెరిగిందని ఆమె చెప్పారు.
సౌందర్య ప్రమాణాలు, రంగు వివక్షపై సాయి పల్లవి ఎప్పుడూ కఠినంగా వ్యవహరిస్తుంటారు. ఇందులో భాగంగానే రూ. 2 కోట్ల విలువైన ఫెయిర్నెస్ క్రీమ్ ఎండార్స్మెంట్ ఆఫర్ను ఆమె సున్నితంగా తిరస్కరించారు. సమాజంలో ఇటువంటి ప్రచారాలు యువత ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తాయని ఆమె భావించారు. సమాజంలో రంగు ఆధారంగా ఎంతోమందిని చిన్నచూపు చూస్తున్నారు. అలాంటి ప్రమాణాలను నేను ప్రమోట్ చేయలేను అని ఆమె స్పష్టం చేశారు. ప్రస్తుతం ఆమె పాత వ్యాఖ్యలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతున్నాయి.