Rajanna Temple | వేములవాడ టౌన్ జూన్ 2 : వేములవాడ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయ విస్తరణ పనులపై త్వరలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వేములవాడ పట్టణవాసులు, భక్తులందరికీ అవగాహన కల్పించనున్నట్లు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ వెల్లడించారు. వేములవాడ రాజన్న ఆలయ విస్తరణ, భీమేశ్వరాలయంలో ఏర్పాట్లపై పట్టణ వాసులు, భక్తులు, పండితులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా అవగాహన కల్పించనున్నట్లు చెప్పారు. రూ.76 కోట్లతో ఆలయ విస్తరణ పనులకు త్వరలో టెండర్లు పిలువనున్నట్లు తెలిపారు. రాజన్న ఆలయాన్ని మూసివేయమని స్పష్టం చేశారు. ఈ విషయంలో ఎలాంటి అసత్య ప్రచారాలు చేయవద్దని కోరారు. స్వామి వారికి నిత్యపూజలు కొనసాగుతాయని తేల్చి చెప్పారు. ఆలయంలో విస్తరణ పనులు చేపట్టనున్న దృష్ట్యా భక్తులకు భీమేశ్వరాలయంలో దర్శనానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.
భీమేశ్వరాలయంలో నిత్య కల్యాణం, షెడ్లు, భక్తుల దర్శనం, క్యూలైన్లు, కోడె మొక్కుల క్యూలైన్లు, ఆలయ ఆవరణలో షెడ్లు తదితర మౌలిక వసతులు వంటి పలు అభివృద్ధి పనులకు త్వరలో టెండర్లు పిలువనున్నట్టు చెప్పారు. విశాలమైన స్థలం ఆధునిక సౌకర్యాలతో గోశాలను నిర్మించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారని.. ఈ మేరకు స్థానికంగా స్థలం గుర్తించాలన్నారు. రాజన్న ఆలయ సమీపంలో కిలోమీటర్ పరిధిలో భారీ భవనాలు నిర్మించవద్దని గతంలో జారీ చేసిన జీవోను కుదించి వంద మీటర్లకు కుదించే విషయంపై చర్చించి.. జీవో సవరణకు ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి సమర్పించాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో స్థపతి వల్లీ నాయకన్, ఆలయ ఈవో వినోద్ రెడ్డి, ఈఈ రాజేశ్, డీఈ మధు రఘునందన్, మైపాల్ రెడ్డి, ఏఈవో అశోక్, అనుబంధ దేవాలయాల పర్యవేక్షకులు వెంకట ప్రసాద్ పాల్గొన్నారు.
రాజన్న ఆ లయానికి సంబంధించి తిప్పాపురంలోని గోశాలలోని కోడెల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ వెంకటరావు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా తిప్పాపురంలోని గోశాల ఆవరణలో కోడెలను కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. కోడెలకు పచ్చిగడ్డి ఇవ్వాలని, నాణ్యమైన దాన పెట్టాలని, క్రమం తప్పకుండా వైద్య శిబిరాలు నిర్వహించాల్సి నిర్వహించి కావాల్సిన మందులు వేయాలని ఆదేశించారు.