సిరిసిల్ల రూరల్, ఫిబ్రవరి 18: తంగళ్లపల్లి మండలంలో ఇసుక అక్రమ రవాణాపై(Illegal sand) రెవెన్యూ అధికారులు కొరడా ఝులిపించారు. తంగళ్లపల్లి మండలం కస్బేకట్కూరు గ్రామం మానేరు వాగులో ఇసుకను రాత్రి వేళలో అక్రమంగా రవాణా చేస్తున్నారని స్థానికులు పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. సోమవారం రాత్రి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను డంప్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం సాగింది.
పలువురు 100 కు పోన్ చేశారు. దీంతో రెవెన్యూ అధికారులు మంగళవారం విచారణ చేపట్టారు. ఇసుక అక్రమ రవాణా జరుగకుండా జేసీబీ తో మానేర్ వాగులోకి వెళ్లకుండా కందకం తవ్వించారు. అనంతరం రాత్రిపూట అక్రమంగా డంపు చేసిన ఇసుకను సీజ్ చేసినట్లు తహసిల్దార్ జయంత్ కుమార్ తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.