సిరిసిల్ల రూరల్, మార్చి 7: సిరిసిల్ల నియోజకవర్గంలో మరో కక్ష సాధింపు చర్యకు పూనుకుంటున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పై అక్కతో సిరిసిల్ల నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాలు(Grain purchasing centers )ఎత్తి వేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. సిరిసిల్ల నియోజకవర్గం పరిధిలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను మహిళా సంఘాలకు అప్పజెప్పేందుకు కలెక్టర్, ఐకెపి అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. దీంతో సంబంధిత ఐకెపి అధికారులు సింగిల్ విండోలు నిర్వహించే కొనుగోలు కేంద్రాల స్థానంలో మహిళా సంఘాలను సిద్ధం చేసేందుకు నిమగ్నమైనట్లు తెలిసింది. ఇప్పటివరకు సింగిల్ విండో ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలను సజావుగా నిర్వహించారు. కక్షపూరితంగా చేయడం వల్ల సింగిల్ విండోలకు వచ్చే ఆదాయం, నిర్వహణ పై తీవ్ర ప్రభావం చూపుతోందని చైర్మన్లు వాపోతున్నారు.
ఇటీవలే సింగిల్ విండో పాలక వర్గాలకు ఎక్స్టెన్షన్..
రాష్ట్ర ప్రభుత్వం సింగిల్ విండో పాలక వర్గాలను 6 నెలల పాటు కొనసాగిస్తూ. ఇటీవలే ఉత్తర్వులు జారీ చేసింది. సిరిసిల్ల నియోజకవర్గంలో 10 సింగిల్ విండోలు ఉండగా, వీరిలో 9 మంది చైర్మన్ లు బీఆర్ఎస్ పార్టీకి చెందినవారే ఉండటంతో కొనుగోలు కేంద్రాలను ఊడగొట్టాలని చూస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీఆర్ఎస్కు చెందిన 9 మంది చైర్మన్లో ఇద్దరు చైర్మన్ లను భూ అక్రమ కేసులు పెట్టి , జైలు పంపారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. కక్షపూరితంగా బీఆర్ఎస్ నేతలతో పాటు జిల్లెళ్ళలో సామాన్య రైతు రాజిరెడ్డిపై , సిరిసిల్లలో టీ స్టాల్ నిర్వాహకుడు పై చర్యలు తీసుకోవడం రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. కాగా సింగిల్ విండోల నుంచి కొనుగోలు కేంద్రాలను ఎత్వివేస్తే రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతారని సింగిల్ విండో చైర్మన్ లు తెలిపారు.