Stock Markets : దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ఆరంభంలో మంచి లాభాలు కనిపించినప్పటికీ.. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడి పెరగడంతో సూచీలు రోజంతా ఒడిదొడుకులకు లోనయ్యాయి. చివరికి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 50.15 పాయింట్ల స్వల్ప లాభంతో 82,276.07 వద్ద, నిఫ్టీ 57.85 పాయింట్ల లాభంతో 25,482.50 వద్ద స్థిరపడ్డాయి.
మార్కెట్లలోని అస్థిరతకు అధిక స్థాయిల వద్ద మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్బీఐ వంటి దిగ్గజ షేర్లలో అమ్మకాల ఒత్తిడి సూచీలపై తీవ్ర భారం మోపింది. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్ లాంటి ఐటీ షేర్లతోపాటు టాటా స్టీల్ లాంటి మెటల్ కంపెనీల షేర్లలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో మార్కెట్లు నష్టాల్లోకి జారుకోకుండా నిలిచాయి.
సెన్సెక్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ అత్యధికంగా 2.23 శాతం నష్టపోయింది. ఎస్బీఐ, భారతీ ఎయిర్టెల్, ఐటీసీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు కూడా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మరోవైపు హెచ్‌సీఎల్ టెక్ 2.8 శాతం లాభంతో టాప్ గెయినర్‌గా నిలిచింది. టాటా స్టీల్, టీసీఎస్, ఇండిగో, సన్ ఫార్మా, మహీంద్రా అండ్ మహీంద్రా షేర్లు కూడా లాభాలను నమోదుచేశాయి.
ప్రధాన సూచీలతో పోలిస్తే బ్రాడర్ మార్కెట్లు మెరుగైన ప్రదర్శన కనబరిచాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.58 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ 100 ఇండెక్స్ 0.96 శాతం చొప్పున లాభపడ్డాయి. రంగాలవారీగా చూస్తే నిఫ్టీ మెటల్ ఇండెక్స్ అత్యధికంగా రాణించగా.. నిఫ్టీ ఐటీ, ఫార్మా సూచీలు కూడా లాభాల్లో ముగిశాయి. అయితే నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంక్ ఇండెక్స్ ఈ సెషన్లో అత్యధికంగా నష్టపోయింది.