Varanasi | తెలుగు చలనచిత్ర పరిశ్రమ సాంకేతిక రంగంలో మరో భారీ మైలురాయిని చేరుకుంది. పాన్ ఇండియా స్థాయిని దాటి గ్లోబల్ మార్కెట్‌పై కన్నేసిన టాలీవుడ్లో, ఇప్పటివరకూ హాలీవుడ్ చిత్రాలకే పరిమితమైన ‘మోషన్ క్యాప్చర్’ (Motion Capture) సాంకేతికత ఇప్పుడు హైదరాబాద్‌లో అందుబాటులోకి వచ్చింది. నగరంలోని ప్రముఖ అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా ఏర్పాటు చేసిన ‘ఎం&ఎం క్యాప్ ల్యాబ్’ (M&M Cap Lab)ను బుధవారం దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి ఘనంగా ప్రారంభించారు.
అన్నపూర్ణ స్టూడియోస్, శోభు యార్లగడ్డకు చెందిన మిహిరా విజువల్ ల్యాబ్స్ మరియు హాలీవుడ్‌కు చెందిన యానిమాట్రిక్ ఫిల్మ్ డిజైన్ సంస్థలు కలిసి ఈ అత్యాధునిక ల్యాబ్‌ను నిర్మించాయి. గతంలో ‘అవతార్’ వంటి సినిమాల కోసం వాడే ఈ టెక్నాలజీ కొరకు మేకర్స్ విదేశాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మన దగ్గరే అందుబాటులోకి రావడంతో సమయం ఖర్చు ఆదా అవడమే కాకుండా నాణ్యత కూడా పెరగబోతుంది.
ఈ ల్యాబ్ ప్రారంభించిన అనంతరం రాజమౌళి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు కథానాయకుడిగా ఆయన తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ లోని కొన్ని కీలక సన్నివేశాలను ఇప్పటికే ఈ ల్యాబ్‌లో చిత్రీకరించినట్లు వెల్లడించారు. అలాగే గతంలో ‘ఈగ’, ‘బాహుబలి’ చేస్తున్నప్పుడు ఇలాంటి టెక్నాలజీ మనకు ఉంటే ఎంత బాగుంటుందో అనిపించేది. ఇప్పుడు ఇది అందుబాటులోకి రావడం భారతీయ ఫిల్మ్ మేకర్స్ ఆలోచనా విధానాన్ని మరో స్థాయికి తీసుకెళ్తుందని తెలిపాడు. అలాగే ‘వారణాసి’ కోసం తీసిన సన్నివేశాల అవుట్‌పుట్ అద్భుతంగా వచ్చింది అని రాజమౌళి ధీమా వ్యక్తం చేశారు. మహేశ్ బాబు – రాజమౌళి కలయికలో వస్తున్న ‘వారణాసి’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.