గద్వాల/అయిజ, ఆగస్టు 9 : శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతున్నది. ఆదివారం జూరాల ప్రాజెక్టు నుంచి కేవలం విద్యుదుత్పత్తి ద్వారా 44,279 క్యూసెక్కుల వరద నీరు విడుదల కాగా మొత్తం 1,01,384 క్యూసెక్కుల నీరు శ్రీశైలానికి చేరినట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885 అడుగులకుగాను ప్రస్తుతం 878.60 అడుగులు, పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 215 టీఎంసీలుకాగా ప్రస్తుతం 181.0590 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్టు అధికారులు పేర్కొన్నారు. ఎడమ గట్టు విద్యుత్తు కేంద్రంలో 22,419 క్యూసెక్కులు. కుడిగట్టులో 26,093 క్యూసెక్కుల నీటిని వినియోగించి విద్యుత్తు ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు నుంచి హంద్రీనివాకు 1,611, ఎంజీకేఎల్‌ఐకి 1,917 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఎగువ నుంచి జూరాల వరద తగ్గిపోవడంతో అధికారులు జూరాల గేట్లను పూర్తి స్థాయిలో మూసి వేశారు. కాగా కర్ణాటకలోని తుంగభద్ర డ్యామ్‌కు ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఆదివారం టీబీ డ్యామ్‌కు 40,500 క్యూసెక్కులు వరద వస్తుండగా, అవుట్ ఫ్లో 1,525 క్యూసెక్కులుగా నమోదైంది. టీబీ డ్యామ్ గరిష్ఠ స్థాయి నీటి మట్టం1,633 అడుగులకుగాను ప్రస్తుతం 1,624.74 అడుగుల నీటి మట్టం ఉండగా, 105.788 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యానికి గాను ప్రస్తుతం 75.644 టీఎంసీల నీటి నిల్వ ఉన్నదని డ్యామ్ సెక్షన్ అధికారి కిరణ్ తెలిపారు.