Pakistani Judge : కోర్టు జడ్జీలు అంటేనే న్యాయాన్ని కాపాడాల్సిన వాళ్లు. అందులోనూ హైకోర్టు స్థాయి జడ్జి అంటే ఇంకెంత నిజాయితీగా ఉండాలి. కానీ, పాకిస్తాన్లో ఒక హైకోర్టు జడ్జి వ్యవస్థనే మోసం చేశాడు. దొంగ సర్టిఫికెట్లతో జడ్జిగా మారాడు. తనకే అర్హత లేకుండా కీలకమైన తీర్పులు ఇచ్చాడు. అలా ఐదేళ్లు సాగిన వ్యవహారం తాజాగా బయటపడింది. తారిక్ ముహమూద్ జహంగిరి ఇస్లామాబాద్ హైకోర్టులో జడ్జిగా పనిచేశాడు.
డిసెంబర్ 2020లో అతడిని జడ్జిగా నియమించారు. ఐదేళ్లు జడ్జిగా పలు తీర్పులు ఇచ్చాడు. అయితే, అతడు విద్యార్హతకు సంబంధించి మాత్రం దొంగ సర్టిఫికెట్లే. ఈ విషయం వెరిఫికేషన్‌లో బయటపడింది. జడ్జిగా నియామకమైన తర్వాత డాక్యుమెంట్లు సమర్పించాల్సి ఉంటుంది. ఇందుకోసం జహంగిరిని అధికారులు పలుసార్లు కోరినప్పటికీ సరైన సర్టిఫికెట్లు సమర్పించడంలో విఫలమయ్యాడు. దీంతో అతడిపై విచారణ జరిపారు. కరాచీ యూనివర్సిటీ రిజిష్ట్రార్ అతడి విద్యార్హతకు సంబంధించి డాక్యుమెంట్లు తనిఖీ చేయగా ఫేక్ అని తేలింది. 1988లో అతడు లా డిగ్రీకి సంబంధించి ఫేక్ హాల్ టికెట్ నెంబర్‌తో హాజరయ్యాడు. అలాగే చీటింగ్ చేస్తూ దొరికిపోయాడు. తర్వాత 1989లో అతడిని మూడేళ్లపాటు యూనివర్సిటీ బ్యాన్ చేసింది. అయినప్పటికీ పేరు మార్చుకుని, వేరే వాళ్లతో పరీక్ష రాయించాడు.
ఇక.. తాను లా చదివినట్లు చెబుతున్న ప్రభుత్వ ఇస్లామియా లా కాలేజ్‌లో అతడికి సంబంధించిన రికార్డులే లేవని చెప్పింది. జహంగిరి తమ సంస్థలో చదవలేదని స్పష్టం చేసింది. దీనిపై యూనివర్సిటీ రిజిష్ట్రార్.. కోర్టుకు 116 పేజీల నివేదిక సమర్పించాడు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు జహంగిరిని తాజాగా హైకోర్టు జడ్జి పదవి నుంచి తొలగించింది. ఈ నెల 23న ఆదేశాలు జారీ చేసింది.