Virosh | టాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్‌గా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ రష్మిక మందన్నలు మరికొద్దిగంటల్లో పెళ్లి పీటలు ఎక్కబోతున్న విషయం మనందరికి తెలిసిందే. ఎన్నేళ్లుగానో ప్రేమలో ఉన్న ఈ జంట తమ సంబంధాన్ని అధికారికంగా ప్రకటించిన తర్వాత అభిమానుల్లో ఉత్సాహం రెట్టింపైంది. ఇప్పుడు “వెడ్డింగ్ ఆఫ్ విరోష్” పేరిట జరగనున్న ఈ వివాహ వేడుకపై దేశవ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఫిబ్రవరి 26న రాజస్థాన్‌లోని అందమైన సరస్సుల నగరం ఉదయ్‌పూర్‌లో అత్యంత రహస్యంగా, పరిమిత అతిథుల సమక్షంలో ఈ వేడుక జరుపుకోనున్నారు. సుమారు 100 మంది అతిథులు మాత్రమే ఈ వేడుకకి హాజరవుతారని సమాచారం. ఇప్పటికే ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు ఉదయ్‌పూర్ చేరుకున్నారు. సంగీత్, హల్దీ, మెహందీ వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.
వీరి వివాహం రెండు సంప్రదాయాల ప్రకారం జరగనుందని తెలుస్తుంది. విజయ్ దేవరకొండ తెలుగు కుటుంబానికి చెందినవారు కాగా, రష్మిక మందన్న కర్ణాటకలోని కొడగు జిల్లా వాసి. ఆమె కొడవ కమ్యూనిటీకి చెందినవారు. ఈ కారణంగానే ఉదయం తెలుగు సాంప్రదాయం ప్రకారం, సాయంత్రం కొడవ ఆచార ప్రకారం వివాహం జరగనుందని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి. కర్ణాటకలోని కొడగు జిల్లాలో నివసించే కొడవ సమాజానికి ప్రత్యేకమైన సంస్కృతి, సంప్రదాయాలు ఉన్నాయి. వీరి వివాహాన్ని “మంగళ” అని పిలుస్తారు. హిందూ వివాహం ప్రకారం అగ్నిగుండం, సప్తపది వంటి ఆచారాలు వారికి ఉండవు. అయితే ఆయుధాలకు ప్రత్యేక పూజ చేస్తారు. వరుడు కత్తి ధరించి ఊరేగింపుగా వచ్చి, అరటి బోదెలను నరికే ఆచారం ప్రత్యేకంగా ఉంటుంది.
పెళ్లి రోజున వధువు సంప్రదాయబద్ధంగా చీరను విభిన్న శైలిలో ధరిస్తారు. వరుడు నలుపు రంగు కోటు, తలపాగా ధరించటం ఆనవాయితీ. మాంసాహారం, వైన్ వంటి వంటకాలు కూడా ఈ వివాహ వేడుకలో భాగమవుతాయి. పూర్వీకులకు, ప్రకృతికి, కావేరి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించడం కొడవ సంస్కృతిలో ముఖ్యమైన భాగం. ఫిబ్రవరి 26నే రెండు సంప్రదాయాల ప్రకారం వివాహం జరగనుంది. ఇక
వివాహానంతరం మార్చి 4న హైదరాబాద్‌లోని ప్రముఖ హోటల్లో సినీ, రాజకీయ ప్రముఖుల కోసం గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. ఈ వేడుకకు పలువురు స్టార్ నటులు, దర్శకులు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ఇన్నేళ్లుగా తమ ప్రేమను గోప్యంగా కొనసాగించిన విజయ్ – రష్మికలు ఇప్పుడు అధికారికంగా దంపతులుగా మారబోతుండటంతో అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. సోషల్ మీడియాలో “విరోష్ వెడ్డింగ్” ఇప్పటికే ట్రెండింగ్‌లో ఉంది.