Sircilla | సిరిసిల్ల టౌన్ : మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో రాజన్న సిరిసిల్ల ప్రభుత్వ జనరల్ దవాఖానలో మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 300 పడకలు ఏర్పాటు చేసి ఆధునీకరించారు. అత్యాధునిక వైద్య సౌకర్యాలు కల్పించారు. డయాలసిస్, ఐసీయూ, ఎన్ఐసీయూ, ఎస్ఎన్సీయూ, స్కానింగ్, టిఫా స్కానింగ్ లాంటి అనేక రకాల వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. ప్రస్తుతం ఇక్కడే క్యాన్సర్ బాధితులకు చికిత్సను అందించేందుకుగానూ కిమోథెరఫీతో పాటు మానసిక రోగుల కోసం డీఎంహెచ్పీ సెంటర్‌ను సిద్ధం చేశారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా జనరల్ దవాఖానలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన డే కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒక ఫిజిషియన్‌తో పాటు ఇద్దరు స్టాఫ్ నర్సులు విధులు నిర్వర్తిస్తారు. కిమోథెరఫీ విభాగంలో పనిచేసే వీరు హైదరాబాద్‌లోని ఎంఎన్‌జే క్యాన్సర్ ఇనిస్టిట్యూట్‌లో మూడు రోజులు శిక్షణ తీసుకున్నారు. బోన్ , బ్లడ్, బ్రెస్ట్ క్యాన్సర్ రోగులకు మెరుగైన చికిత్స అందించనున్నారు. 40 రకాల మందులు అందుబాటులోకి తేవడంతో రోగులకు హైదరాబాద్ లాంటి దూరప్రాంతాలకు వెళ్లాల్సిన భారం తప్పనున్నది. నేడు(గురువారం)జిల్లా దవాఖానలో మొదటి అంతస్తులో ఏర్పాటుచేసిన డే కేర్ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.
Sircilla Hospital2
జిల్లా దవాఖానలో మైండ్ కేర్ సెంటర్ ఆధ్వర్యంలో సైకాలజీ విభాగంలో చాలా కాలంగా మానసిక రుగ్మలతో బాధపడుతున్న వారికి కౌన్సెలింగ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నారు. ఇదే తరహాలో దవాఖాన మొదటి అంతస్తులో డీఎంహెచ్పీ(డిస్టిక్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం)సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ సైక్రియాట్రిస్ట్, ఇద్దరు సీనియర్ రెసిడెంటు సేవలందించనున్నారు. గతంలో మానసిక సమస్యలతో బాధపడుతున్న వారికి చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇక్కడి దవాఖానలో డీఎంహెచ్పీ సెంటర్‌తో రోగులకు వ్యయప్రయాసలు తప్పనున్నాయి. త్వరలోనే ఈ వైద్య సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా దవాఖానలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులకు ఫాలో ఆప్ ట్రీట్మెంట్ను అందించేందుకు డే కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. ఇందులో 40 రకాల మెడిసిన్ అందుబాటులో ఉన్నాయి. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. అదేవిధంగా డీఎంహెచ్పీ సెంటర్ ఏర్పాటుతో మానసిక సమస్యలతో బాధపడుతున్న రోగులకు చికి త్స అందించే అవకాశం ఉంటుంది. త్వరలోనే ఈ వైద్య సేవలను అందుబాటులోకి తెస్తాం. జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– మురళీధర్‌రావు, దవాఖాన సూపరిండెంట్