Rajanna Kode deaths | వేములవాడ, జూన్ 8: వేములవాడ రాజన్న కోడెల మృతిలో ప్రధమ ముద్దాయి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అని బీఆర్ఎస్ పార్టీ వేములవాడ నియోజకవర్గం ఇన్‌ఛార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ రాజన్న ఆలయానికి భక్తులు సమర్పించిన కోడేలు అధికారిక లెక్కల ప్రకారం 33 మృతిచెందగా.. చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆదివారం నాయకులతో కలిసి పరిశీలించి మాట్లాడారు. తప్పంతా వారే చేసి ఎదుటివారిపై బురద జల్లినట్లుగా కొండా సురేఖ తీరు ఉందని ఆయన విమర్శించారు.
కలెక్టర్ కన్వీనర్ గా ఉండి ఒక్కో రైతుకు పక్కాగా వివరాలు తీసుకొని నిబంధన ప్రకారం రెండు కోడెలను మాత్రమే ఇవ్వాలని నిర్ణయించగా దేవాదాయ శాఖ మంత్రి ఈ నిబంధనలను తుంగలో తొక్కిందన్నారు. తన సిఫారసు లేక ద్వారా గీసుకొండకు చెందిన రాంబాబు అనే వ్యక్తికి అక్రమ పద్ధతిలో అధికారులపై ఒత్తిడి తెచ్చి 60 కోడెలను ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. ఇందులో 49 కోడలు మాయమైపోగా, అతనిపై గీసుకొండ పోలీస్ స్టేషన్లో కేసు నమోదై రాంబాబును జైలుకు వెళ్లిన విషయం కూడా మీడియాలో కథనాలు వచ్చాయని చూపారు.
రాజన్న భక్తుల విశ్వాసానికి, నమ్మకానికి ప్రతీకైన కోడెలు మృత్యువాత పడటంలో ప్రధాన మొదటి ముద్దాయి మంత్రి సురేఖనేనని విమర్శించారు. దీంతో డిసెంబర్ మాసం నుండి కోడెల పంపిణీ ప్రక్రియ నిలిచిపోగా రాజన్న గోశాలలో 500 ఉండాల్సిన చోట 1300 చేరాయని అన్నారు. ఇక్కడ అసలైన రాజకీయం ఎవరు చేస్తున్నారో ఆలోచించాలన్నారు. గత ప్రభుత్వం ఏడాదికి 100 కోట్ల రూపాయలు ఇస్తానని మోసానికి పాల్పడిందని మంత్రి సురేఖ ఆరోపించడంలో అర్థం లేదన్నారు. రాజన్న ఆలయానికి 30 ఎకరాలు సేకరించింది గత ప్రభుత్వమేనని గుర్తు చేశారు. బద్ది పోచమ్మ ఆలయ నిర్మాణానికి ఎకరం స్థలం కూడా సేకరించింది గత ప్రభుత్వమేనని గుర్తు చేశారు.
వందల కోట్ల రూపాయలతో పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పథంలో నిలిపింది కూడా తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అని మంత్రి సురేఖకు తెలువకపోవడం దురదృష్టం అన్నారు. ఇప్పుడు రాజన్న ఆలయాన్ని చేపట్టే విస్తరణ కూడా గత ప్రభుత్వం సేకరించిన స్థలంలోనే అని కూడా తెలువకపోవడం ఆమె చేపడుతున్న మంత్రి పదవికి అర్థం లేదని గాటుగా విమర్శించారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కూడా అవగాహన లేకుండా కోడెలు లంపి స్కిన్ డిసీజ్‌తో చచ్చిపోతున్నాయని తెలపడం ఆయనకు ఉన్న శ్రద్ధ ఏమిటో తెలిసిపోయిందని ఎద్దేవా చేశారు. సాక్షాత్తు పశు వైద్యాధికారులే సరైన పోషకాహారం అందక చనిపోతున్నాయని వెల్లడిస్తున్న కనీస వివరాలు తెలుసుకోకుండా మాట్లాడుతున్నా తీరు అధికారంలో ఉంటే చెప్పిందే చెల్లుబాటవుతుందనేది ఆయన తీరు ఉన్నట్లుగా విమర్శించారు.
గత ప్రభుత్వం రూపొందించిన నమూనాలనే ప్రచారం చేసుకుంటున్నారు…
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం రూపొందించిన నమూనాలు, అంచనాలతో కూడిన ఛాయాచిత్రాల అభివృద్ధి పేరుతో పత్రికల్లో వస్తున్న కథనాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం సోషల్ మీడియాలో అభివృద్ధి అని ప్రచారం చేసుకుంటుందని విమర్శించారు. కనీసం ఇప్పటివరకు డీపీఆర్, నమూనాలను కూడా రూపొందించకుండా మీడియాలో వస్తున్న కథనాలను మాత్రం తాము చేయబోతున్నట్లుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. మరి ఇలానే కొనసాగుతాయా లేవా అనేది కూడా వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు.
జూన్ 15 నుండి ఆలయాన్ని మూసివేస్తామని భక్తుల్ని ఆగం చేశారు…
హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ వేదికగా సమావేశం నిర్వహించి జూన్ 15 నుండి రాజన్న ఆలయాన్ని బంద్ చేస్తామని ప్రకటించి భక్తులను ఆగం చేశారని విమర్శించారు. ఇక రాజన్న ఆలయం బంద్ అవుతుందన్న నేపథ్యంలో స్వామివారిని దర్శించుకునేందుకు ప్రతి నిత్యం 20 వేల నుండి 30 వేల మంది భక్తులు దర్శనానికి వస్తుండగా వారికి కనీస వసతి సౌకర్యాలు కల్పించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గంటల తరబడి నిరీక్షించి క్యూ లైన్ లో భక్తులు పడిపోతున్నా పట్టించుకోవడంలేదని ఆరోపించారు. రద్దీకి తగిన సౌకర్యాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
రాజన్న గోశాలలో గడ్డి స్కాం…
వేములవాడ రాజన్న ఆలయంలోని గోశాలలో ప్రతీ రోజు గడ్డి పశువులకు వేయకుండా అవినీతిపరులు స్కాంకు పాల్పడుతున్నారని చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆరోపించారు. రోజుకు 10 టన్నుల చొప్పున గడ్డిని కోడెలకు అందించేందుకు టెండర్ ప్రక్రియ నిర్వహించారన్నారు. పది టన్నుల గడ్డిని అందజేయాలంటే కనీసం 25 ఎకరాల్లో పచ్చి గడ్డి వేసి ఉండాలన్నారు. సదర్ కాంట్రాక్టర్‌కు 8 ఎకరాల వరకే ఉన్నట్టుగా తనకు సమాచారం ఉందని, ఇందులో ప్రతిరోజు కేవలం రెండు టన్నులు మాత్రమే పచ్చి గడ్డి తెస్తూ మిగతా ఆరు టన్నులు కాగితాల్లోనే నమోదు అవుతున్నాయని ఆరోపించారు. సుమారు రోజు 16 వేల రూపాయలు, నెలకు దాదాపు 5 లక్షల రూపాయల వరకు గడ్డి కోడెలకు వేయకుండా స్కామ్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు.
సమగ్ర దర్యాప్తు జరిపించి కనీసం గడ్డినైనా సక్రమంగా అందించాలని ఆయన డిమాండ్ చేశారు. రాజకీయాలు ఎవరూ చేయడం లేదని, రాజన్న భక్తుల మనోభావాలు కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కనీసం పశువులకు కడుపునిండా తిండి పెట్టాలని మాత్రమే తాము మాట్లాడుతున్నామని.. ఇలాంటి విషయాలు కూడా మంత్రికి తెలియకపోవడం విడ్డూరమన్నారు. కోడెల మృతిలో బాధ్యులపై కచ్చితంగా చర్యలు తీసుకోవాలని గడ్డిలో జరుగుతున్న స్కాంపై విచారణ జరపాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఆయన వెంట పార్టీ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, న్యాలకొండ రాఘవరెడ్డి, మాజీ జెడ్పిటిసి మ్యాకల రవి, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కందుల క్రాంతి కుమార్, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు గోస్కుల రవి, పొలాస నరేందర్, రామతీర్థపు రాజు, జోగిని శంకర్, నరాల శేఖర్, నిమ్మశెట్టి విజయ్, ముద్రకోల వెంకటేశం, వెంగళ శ్రీకాంత్ గౌడ్, వెంకట్ రెడ్డి, మల్లేశం, సత్యనారాయణ రెడ్డి, రాధా కిషన్ రావు, అనిల్ కుమార్, నరేష్ తదితరులు ఉన్నారు.
Badibata | బడిబాట కార్యక్రమం ప్రారంభించిన బీఆర్ఎస్ మాజీ సర్పంచ్ పోచయ్య
Edupayala | ఏడుపాయలలో భక్తుల సందడి
Telangana Cabinet | తెలంగాణ కేబినెట్లోకి ముగ్గురు మంత్రులు.. రాజ్‌భవన్‌లో ప్రమాణస్వీకారం పూర్తి