సిరిసిల్ల రూరల్, డిసెంబర్ 16: రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో (Sarpanch Elections) రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాల్లో విద్యావంతులు బరిలో నిలిచి గెలిచారు. ఉన్నత విద్యనభ్యసించి ప్రజా సేవ చేసేందుకు పోటీలో నిలిచి గ్రామ ప్రథమ పౌరులుగా (Sarpanch) ఎన్నికయ్యారు. తంగళ్లపల్లి మండలం బస్వాపూర్ సర్పంచ్‌గా గెలిచిన పుర్మాణి రాజశేఖర్ రెడ్డి ఎంబీఏ చేశారు. తంగళ్ళపల్లి మండలం రామన్నపల్లి సర్పంచ్ గెలిచిన ఆత్మకూరి జ్యోతి బీఈడీ, పీజీ పూర్తి చేశారు.
బద్దెనపల్లి సర్పంచ్‌గా విజయం సాధించిన సిలువేరి లావణ్య డిగ్రీ, బీఈడీ చదివారు. అదే విధంగా చిన్నలింగాపూర్ సర్పంచ్ గెలుపొందిన శ్యాగ విజయ బీఎస్సీ, బీఈడీ చదివారు. ఆమె మహిళా
సంఘాలలో సీఏగా పని చేసి, సర్పంచ్ బరిలో నిలిచి గెలిచారు. మండెపల్లిలో గెలిచిన గదిగోని సాగర్ ఎంఏ, స్పెషల్ బీఈడీ పూర్తి చేశారు. వీరంతా ఈనెల 20న సర్పంచ్ పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.
విద్యావంతులుగా ఉండి, గ్రామ ప్రథమ పౌరులుగా, ప్రజా సేవకు సిద్ధమవుతుండటం పట్ల సర్వత్ర హర్షం వ్యక్తమవుతున్నది. ఒక వైపు ఉద్యోగ ప్రయత్నం చేస్తూనే, పంచాయతీ ఎన్నికల్లో ప్రజా సేవ కోసం పోటీ పడి, గెలిచి పల్లె సేవకు సిద్దమవడం విశేషం.