సిరిసిల్ల రూరల్, మే 13: రాజన్న సిరిసిల్ల (Sircilla) జిల్లా తంగళ్లపల్లి మండలంలో రైతులు రోడ్డెక్కారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రంలో నిర్లక్ష్య వైఖరితోపాటు ధాన్యం కాంటా వేస్తలేరని ఆందోళన చేశారు. తంగళ్లపల్లి మండలం జిల్లెల్లలోని సిరిసిల్ల- సిద్దిపేట రహదారిపై రైతులు బైఠాయించి ధర్నా చేశారు. ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలోని ఐకేపీ కొనుగోలు కేంద్రంలో రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆరోపించారు. సన్న వడ్లు పూర్తిగా కొనుగోలు చేయలేదని, కాంటా పెట్టిన సన్న వడ్లను కూడా వదిలేశారన్నారు.
కొనుగోలు కేంద్రం నుంచి తీసుకెళ్లిన వడ్లను కేటాయించిన రైస్ మిల్లు అన్లోడింగ్ చేయలేదని, కొనుగోలు కేంద్రంలో ఉన్న వడ్లను తీసుకపోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలంలోని అన్ని కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన సన్నవాడ్లకు ఇప్పటివరకు డబ్బులు చెల్లించలేదని పేర్కొన్నారు. కనీసం ఆన్లైన్లో ఎంట్రీ కూడా చేయలేదని, ఎప్పుడు డబ్బులు ఇస్తారని ఫైర్ అయ్యారు. అన్ని మండలాల్లో సన్న వడ్లు కొనుగోలు చేసిన అధికారులు, ఒక తంగళ్లపల్లి మండలంలోని సన్న వడ్లను ఎందుకు పెండింగ్ పెడుతున్నారని ప్రశ్నించారు. వెంటనే కొనుగోలు కేంద్రంలో ధాన్యము కొనుగోలు చేసి, ఆ మొత్తానికి ఖాతాలో నగదు వేయాలని డిమాండ్ చేశారు.
అధికారులు కొనుగోలు కేంద్రాలపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనీ ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని.. సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని చెప్పడంతో రైతులు శాంతించారు. కార్యక్రమంలో జిల్లెళ్ళ, నెరెల్ల రైతులు పాల్గొన్నారు. రైతులకు మద్దతుగా బీఆర్ఎస్ నేతలు మాట్ల మధు, చెన్నమనేని వెంకట్రావు, సింగిల్ విండో మాజీ చైర్మన్ పబ్బతి విజయేందర్ రెడ్డి, అబ్బా డి తిరుపతి రెడ్డి, సతీష్ రెడ్డి తో పాటు పార్టీ నేతలు రైతులతో కలిసి ఆందోళన చేశారు.