Sircilla | రాజన్న సిరిసిల్ల జిల్లాలో విషాదం నెలకొంది. అప్పుల బాధతో యువరైతు ఆత్మహత్య చేసుకున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల మునిసిపాలిటీలోని రగుడుకు చెందిన రైతు బైకని ప్రభాకర్ యాదవ్ (38) తనకున్న రెండెకరాల పొలంతో పాటు మరో పదెకరాలు కౌలు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. గత వర్షాకలంలో వరి సాగు చేయగా.. అధిక వర్షాలతో కోతకొచ్చిన పంట నీట మునిగి తీవ్ర నష్టం వాటిల్లింది. అప్పటికే సాగు కోసం రూ.15 లక్షల అప్పు చేశాడు. పంట నష్టపోవడంతో ఆ అప్పు ఎలా తీర్చాలో తెలియక కొద్దిరోజులుగా సతమతమవుతున్నాడు. ఈ క్రమంలోనే ఈ నెల 16వ తేదీన మధ్యాహ్నం పొలానికి వెళ్తున్నానని ఇంట్లో చెప్పి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత పురుగుల మందు తాగాడు. ఈ విషయాన్ని తన అన్న వెంకటేశ్‌కు ఫోన్ చేసి చెప్పాడు.
పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంటున్నానని ప్రభాకర్ ఫోన్ చేసి చెప్పడంతో కంగారుపడిపోయిన వెంకటేశ్ హుటాహుటిన వెళ్లాడు. అప్పటికే ప్రభాకర్ అపస్మారక స్థితిలో కనిపించాడు. దీంతో వెంటనే ప్రభాకర్‌ను సిరిసిల్ల ఏరియా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో అక్కడే చికిత్స పొందుతూ శనివారం మృతిచెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.