సిరిసిల్ల రూరల్, మార్చి 5: రంగనాయక సాగర్ కెనాల్(Ranganayaka Sagar) నుంచి ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలం మీదుగా కేసీఆర్ సర్కార్ చేపట్టిన కేఎల్ -6 కాల్వ పనులు నిలిచిపోయాయి. ఏడాదిన్నరగా కాల్వ పనులు పెండింగ్లో ఉండటంతో సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయి. కేసీఆర్ సర్కా ర్ హయాంలో సాగునీరుకు ప్రత్యేక చర్యలు తీసుకొని తంగళ్లపల్లి మండలంలోని చెరువుల నింపిన విషయం తెలిసిందే. ప్రస్తుతం కాలువ పనులు ఆగిపోవడంతో రంగనాయక సాగర్ నుంచి నీటి సరఫరా నిలిచిపోయి చెరువులు నిండక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. తంగళ్లపల్లి మండలం నర్సింహులపల్లి శివారులోని మందాన్ చెరువు, బాలలపల్లి శివారులోని సోమయ్య చెరువు ల్లోకి చుక్కనీరు చేరలేదు.
దీంతో తంగళ్లపల్లి మండలం బాలములపల్లి, నర్సింహులపల్లి, బస్వాపూర్, రామన్నపల్లి , ఇల్లంతకుంట మండలం పెద్ద లింగాపూర్ లో రైతులు కాల్వ పనులు చేపట్టాలని రిలే దీక్షలు చేపట్టారు. ఈ కాలువ ద్వారా మందాన్ చెరువు, సోమయ్య చెరువు నిండితే, బస్వాపూర్ లోని ఎల్లమ్మ చెరువు, అంకుశ పూర్, తాడూరులోని చెరువులో నుండి సాగుకు నీళ్లు చేరేవి. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో మండుటెండల్లో సైతం చెరువులు మత్తడి దూకేవని రైతులు నాటి పరిస్థితులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కాలువ పనులు చేపట్టి, సాగు నీరు అందివ్వాలని రైతులు కోరుతున్నారు.