సిరిసిల్ల టౌన్, ఏప్రిల్ 11: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సహకారంతోనే సిరిసిల్లలో (Sircilla) టెక్స్పోర్ట్ ఇండస్ట్రీ అందుబాటులోకి వచ్చిందని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు జంగం చక్రపాణి కొనియాడారు. స్థానిక ఆపేరల్ పార్కులో టెక్స్ పోర్టు ఇండస్ట్రీ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకొని సిరిసిల్లలోని నేతన్న చౌక్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేసీఆర్, కేటీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. పటాకులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలోనే కేటీఆర్ చొరవతో అపేరల్ పార్కులో ఏర్పాటు చేసిన గోకుల్ దాస్ కంపెనీ ద్వారా దాదాపు 3 వేల మంది మహిళలు ఉపాధి పొందుతున్నారని తెలిపారు.
2022 లోనే ఏడు ఎకరాల స్థలంలో టెక్స్పోర్టు కంపెనీ ఏర్పాటు కోసం కేటీఆర్ శంకుస్థాపన చేశారని పేర్కొన్నారు. టెక్స్ పోర్టు కంపెనీ ఏర్పాటు ద్వారా మహిళలు ఉపాధిని మెరుగు పరచాలన్నది కేటీఆర్ సంకల్పమని తెలిపారు. కార్మికులను యజమానులుగా చేయాలన్న లక్ష్యంతో గత ప్రభుత్వ హయాంలోనే కేటీఆర్ వర్కు టు ఓనర్ పథకం కోసం రూ 380 కోట్లు కేటాయించి ఉన్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే వర్క్ టూఓనర్ పథకాన్ని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పట్టణ మహిళా విభాగం అధ్యక్షురాలు బత్తుల వనజ, అర్బన్ చైర్మన్ రాపెళ్లి లక్ష్మీనారాయణ, మ్యాన రవి, సత్తార్, హరీష్, తదితర నాయకులు పాల్గొన్నారు.