రైతుబంధు కింద కేసీఆర్ ఇస్తున్నది రూ.10 వేలు మాత్రమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తాం. రెండు పంటలకే ఎట్ల ఇస్తరు. మేము వచ్చాక మూడు పంటలకు ఇస్తాం”.. ఇవి ఎన్నికలకు ముందు రేవంత్‌రెడ్డి చెప్పిన మాటలు. తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక పెట్టుబడి సాయం పథకానికి భరోసా లేకుండా పోయింది. అసలు వస్తుందో.. రాదో కూడా తెలియని సందిగ్ధత నెలకొన్నది. ఎన్నికలు వచ్చినయంటే చాలు రైతుభరోసా గుర్తుకొస్తది. ఎలక్షన్లు అయిపోయినాక దాని ఊసే ఉండదని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తున్నది. సెప్టెంబర్ మాసంలో వేయాల్సిన డబ్బులు ఫిబ్రవరి వచ్చినా వేయలేదని అన్నదాతలు మండిపడుతున్నారు.
మోర్తాడ్/ఎల్లారెడ్డి, ఫిబ్రవరి 23: రైతుభరోసా పథకానికి భరోసా లేకుండా పోయిం ది. పంట పెట్టుబడి సాయం ఇస్తారో ఇయ్యారో తెలియని అయోమయం నెలకొన్నది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నా రెండుసార్లు మాత్రమే రైతుభరోసా నిధులు విడుదల చేయడంతో ఈ గందరగోళం ఏర్పడింది. ప్రస్తుత యాసంగికి సంబంధించి సెప్టెంబర్ మాసంలో వేయాల్సిన పెట్టుబడి సాయం ఫిబ్రవరి ముగింపుకొస్తున్నా వేయకపోవడంపై రైతాంగంలో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నార్లు పోసే సమయానికి రావాల్సిన పైసలు నాట్లు వేసి నెలలు గడుస్తున్నా రాకపోవడంపై అసహనం వెల్లువెత్తుతున్నది. పెట్టుబడి సాయం ఇవ్వకుండా, అవసరమైన యూరియా సరఫరా చేయకుండా ప్రభుత్వం అరిగోస పెడుతున్నదని రైతులు మండిపడుతున్నారు.
నాట్లు అయిపోయినా..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తవుతున్నది. ఈ కాలంలో రెండుసార్లు మాత్రమే రైతుభరోసా డబ్బులు జమ చేసింది. కేసీఆర్ హయాంలో ఠంచన్‌గా వచ్చిన పెట్టుబడి సాయాన్ని ప్రస్తుత ప్రభుత్వం ఎగవేస్తుండడంపై అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. యాసంగి పంటలు వేయడం ముగిసినా రైతు భరోసా రాకపాయే. పంటలు వేసేందుకు అప్పులు చేసే పాత రోజుల వచ్చినయని రైతులు గుర్తు చేసుకుంటున్నరు. అప్పుసప్పు చేసి పంటలు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని వాపోతున్నారు. “ఎక్కువ ఇవ్వకున్నా కేసీఆర్ ఇచ్చినట్లుగానే ఇచ్చిన సంతోషపడుతుంటిమి, అసలుకే మోసం చేయడమేంటని” ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఉమ్మడి జిల్లాలో 5.50 లక్షల మంది..
రైతు భరోసా కోసం ఉమ్మడి జిల్లాలో లక్షలాది మంది రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్ జిల్లాలో 2,60,617 మంది రైతులు అర్హులుగా ఉన్నారు. వీరికి రూ.230 కోట్లకు పైగా రైతుభరోసా నిధులు రావాల్సి ఉంది. ఇక, కామారెడ్డి జిల్లాలో 2.96 లక్షల మంది రైతులు ఉండగా, వీరికి రూ.246 కోట్లకు పైగా పెట్టుబడి సాయం అందాల్సి ఉంది. సెప్టెంబర్, అక్టోబర్‌లో ఇవ్వాల్సిన ప్రభుత్వ సాయం ఫిబ్రవరి వచ్చినప్పటికీ ఇవ్వకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నాట్లు పూర్తయ్యాయి. విత్తనాలు, ఎరువుల కొనుగోళ్ల కోసం రైతులు అప్పులు చేశారు. ప్రభుత్వం రైతుభరోసా నిధులు విడుదల చేస్తుందన్న నమ్మకంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అయినప్పటికీ సర్కారు స్పందించక పోవడంతో వారి ఆశలు అడియాసలవుతున్నాయి.

ఎన్నికలప్పుడేనా?
కాంగ్రెస్ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి నాలుగు పంట కాలాలు పూర్తి కాగా, ప్రస్తుతం ఐదోది నడుస్తున్నది. కానీ ఇప్పటివరకు ఇచ్చింది మాత్రం అరకొరగానే. గత వానాకాలం సీజన్లో పెట్టుబడి సాయం అందించడానికి గ్రామపంచాయతీ ఎన్నికలే కారణమనే అభిప్రాయం వ్యక్తమవుతున్నది. ఎన్నికలు వచ్చినప్పుడు మాత్రమే ఇస్తారా, లేక ఇప్పుడిస్తం, అప్పుడిస్తం అంటూ కాలం గడిపేస్తారా? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లుగా ప్రతి పంట సీజన్‌కు ఠంచన్‌గా రైతుభరోసా ఇస్తే ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని రైతులు అంటున్నారు.
కేసీఆర్ తెచ్చిన ప్రతిష్టాత్మక పథకం..
దేశంలోనే తొలిసారిగా రైతులకు పంట పెట్టుబడి సాయం చేసిన ఘనత కేసీఆర్ సొంతం. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం రైతులు అప్పుల పాలవుతున్నారని గుర్తించిన బీఆర్ఎస్ సర్కారు.. అప్పులు చేసే పరిస్థితి రావొద్దని ప్రతిష్టాత్మక రైతుబంధు పథకానికి 2018లో శ్రీకారం చుట్టింది. వానాకాలం, యాసంగి పంటల సాగుకు ఎకరాకు రూ.5 వేల చొప్పున ఏడాదికి రూ.10 వేల సాయం అందజేసింది. విత్తనాలు, ఎరువుల కొనుగోలుతో పాటు కూలీ ఖర్చుల కోసం జూన్, సెప్టెంబర్ మాసాల్లో ఠంచన్‌గా రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. అయితే, అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రైతులపై అనేక హామీలు గుప్పించారు. రైతుభరోసా పథకం కింద పంట పెట్టుబడి సాయాన్ని రూ.15 వేలకు పెంచుతామని మాట ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చాక చేతులెత్తేశారు.
వస్తదన్న భరోసా లేదు..
రైతుభరోసా వస్తదన్న భరోసా మాకు లేదు. కేసీఆర్ ఉన్నపుడు ఠంఛన్‌గా రైతుబంధు డబ్బులు ఖాతాల పడుతుండే. పంటలు వేసుకునేందుకు ఈ పైసలు ఎంతగానో ఉపయోగపడుతుం డే. గీ కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి రెండేండ్లల్ల రెండుసార్లే వచ్చింది. అదికూడా ఓసారి రూ.5వేల చొప్పున, మరోసారి రూ.6 వేల చొప్పున ఖాతాల వేసింది. ఎన్నికలప్పుడేమో రూ.15 వేలిస్తా అని చెప్పి మోసంజేసి ఓట్లు ఏపించుకునే. ఇప్పుడేమో రైతుభరోసా ఇయ్యకుండా అప్పుడు, ఇప్పుడు అనవట్టే. అందుకే ఇక వస్తదన్న ఆశను వదిలేసుకున్నం.
– పర్స దేవన్న, రైతు,దోన్పాల్
పాత లెక్కనన్న ఇయ్యాలే..
కేసీఆర్ సార్ ఉన్నప్పుడు నార్లు పోసే టప్పుడే రైతుబంధు పైసలు వస్తుండే. యాట రెండుసార్లు ఖాతాల డబ్బులు పడుతుండే. కాంగ్రెసోళ్లు ప్రజల మోచేతికి బెల్లం పెట్టిండ్రు. ఎన్నికల ముందర మస్తు చెప్పి, ఇప్పుడు చేతులెత్తేసిండ్రు. రూ.10 వేలు కాదు, రూ.15 వేలు ఇస్తామన్నారు. కనీసం పాత లెక్కనన్న రూ.10 వేలు ఇయ్యాల కదా? అవి కూడా ఇస్తలేరు. ఇప్పుడస్తాయి, అప్పుడస్తయి అని పుకార్లు వినుడే తప్ప రైతుభరోసా పైసలు మాత్రం వస్తలేవు. మోచేతికి బెల్లంబెట్టి తినుండ్రి అన్నట్టుంది రైతుభరోసా సంగతి.
– సంత రాజేశ్వర్, రైతు, కమ్మర్పల్లి
పెట్టుబడి కోసం అప్పులు..
పంటలు వేయడానికి మునుపు అప్పులు చేస్తుంటిమి. కానీ కేసీఆర్ రైతుబంధు మొదలుపెట్టినప్పటి నుంచి అప్పుల గోస లేకుండా పోయింది. బీఆర్ఎస్ హయాం లో పంటలు వేసే ముందే రైతుబంధు పైస లు వస్తుండే. పంట పెట్టుబడికి అవి సరిపోతుండే. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినంక రైతుభరోసా డబ్బులకు గ్యారంటీ లేకు ండా పోయింది. వానాకాలం పంట భారీ వర్షాలతో దెబ్బతిని దిగుబడి తగ్గింది. పెట్టుబడితో పాటు కష్టం కూడా పోయింది. యాసంగిల అప్పులు తెచ్చి నాట్లు వేసిన. ఫిబ్రవరి అయిపోతున్నా రైతు భరోసా పైసలు ఇంకా రాలే.
– యాదగిరి, రైతు, ఎల్లారెడ్డి
కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగుండే..
రైతు భరోసా కోసం లక్షల మంది రైతులు ఎదురుచూస్తుండ్రు. పం టలు వేసి నెలలు గడుస్తున్నా ఇప్పటికీ డబ్బులు వేయలేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఆర్నెళ్లకు ఒక సారి అడగక ముందే పైసలు ఖాతాల పడే టివి. అదే, రేవం త్ సర్కారు వచ్చినంక రెండే సార్లు వచ్చినవి. కేవలం మాటలతో నడిచే సర్కారు ఇది. రేపు, మాపు అంటూ రైతు లకు ఆశలు పెట్టి పబ్బం గడుపు తున్న కాంగ్రెస్ ప్రభు త్వానికి రోజులు దగ్గర పడ్డాయ్.
– నారాయణ, రైతు, సోమారిపేట.
అసలుకే ఎసరు పెట్టిండ్రు
కాంగ్రెస్‌ది దయలేని ప్రభుత్వం. దరిద్రమైన ప్రభుత్వం. రైతులపై ఏ మాత్రం కరుణ లేదు. రైతులకు చేయూతగా నిలిచిన రైతుబంధు పథ కాన్ని రైతు భరోసాగా మార్చి, రూ.15 వేలు ఇస్తామని చెప్పిండ్రు. ఇప్పుడు అసలుకే ఎసరు పెట్టిండ్రు. కేసీఆర్ సారు ఉన్నప్పుడు ఏడాదికి రెండు సార్లు ఠంఛన్‌గా వస్తుండే. కాంగ్రెస్ వచ్చినంక ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు ఆగుతుందో తెలుస్తలేదు. అందరికంటే ఎక్కువగా కష్టపడే వర్గమే రైతులు. అలాంటి వారికి ఇచ్చే రైతుభరోసాను మింగిన ప్రభుత్వం ఎక్కువ రోజులు మను గడలో ఉండనే ఉండదు.
– శ్రావణ్‌కుమార్, రైతు, గండి మాసానిపేట