హనుమకొండ, ఫిబ్రవరి 23: రెండున్నరేళ్ల క్రితం అలవికాని హామీలు, మోసపూరిత మాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందని బీఆర్ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్ ఆరోపించారు. సోమవారం బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డితో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నదని, ఉద్యమ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నదన్నారు.
420 హామీలు, 6 గ్యారంటీల అమలును మరిచి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని ధ్వజమెత్తారు. బాధ్యత గల ప్రతిపక్షంగా ప్రజల తరపున పోరాడుతున్నామని, జనతా గ్యారేజ్లాగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు పని చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం దేవాదుల ప్రాజెక్టును 90 శాతం పూర్తిచేసిందని, మిగిలిన 10 శాతం పనులను కూడా ఈ ప్రభుత్వం రెండేళ్లలో పూర్తిచేయలేక పోయిందన్నారు. గతంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇతర మంత్రులతో కలిసి దేవాదులకు గాలిలో వచ్చి గాలి మాటలు చెప్పి వెళ్లిపోయారన్నారు. శాసనసభా పక్ష ఉపనేత హరీశ్‌రావు పర్యటించిన ఒకరోజు తర్వాత సీఎం మంత్రులతో కలిసి వచ్చి దేవాదుల ప్రాజెక్టు విషయంలో మాయమాటలు చెప్పి మరోసారి ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం 30 వేల ఎకరాలు ప్రాజెక్టు కోసం భూసేకరణ చేస్తే కాంగ్రెస్ సర్కారు మిగిలిన మూడు వేల ఎకరాలు చేయలేకపోయిందన్నారు. అంతేకాక హరీశ్‌రావు ఇటీవల దేవాదుల ప్రాజెక్టు పరిశీలనకు వస్తే అధికారులు కనీసం ప్రొటోకాల్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు కనీసం సాగునీరివ్వలేని దుస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. ఇటీవల జరిగిన ఏపీ, తెలంగాణ డీసీసీ అధ్యక్షుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ కోసం రూ. 1000 కోట్లు వెచ్చిస్తానని చెప్పారని, అది ఎవరి సొమ్మంటూ ప్రశ్నించారు. అన్నదాతలకు డబ్బులు లేవన్న సీఎం సిగ్గులేకుండా కాంగ్రెస్ పెద్దలకు విరాళం ఇస్తారట అని ఎద్దేవా చేశారు. ప్రజల రక్తాన్ని పీల్చిపిప్పి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని, ఆ పార్టీకి కౌంట్‌డౌన్ మొదలైందని దాస్యం అన్నారు. సమావేశంలో మాజీ చైర్మన్లు మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, వరంగల్ పశ్చిమ నియోజక వర్గ కో ఆర్డినేటర్ పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, నాయకులు నయీముద్దీన్, రవీందర్రావు, పోలపల్లి రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.
ఎన్నికల ఫండ్ కోసమే సమీక్ష
దేవాదులపై కాంగ్రెస్ సర్కారు వాయిదాలు వేస్తున్నది. ప్రాజెక్ట్‌ను 2027 డిసెంబర్ చివరికల్లా పూర్తి చేస్తామని సీఎం అంటున్నడు. ఆయనే గతంలో 2024 ఆగస్ట్ 21 వరకు పూర్తి చేస్తామన్నరు. ఇదే కాంగ్రెస్ మంత్రులు 2025లో పూర్తి చేస్తామని చెప్పారు. ఒకే ప్రభుత్వంలోని మంత్రులు ఇన్నిసార్లు మాట మార్చడం అంటే ప్రజలను ఏమార్చడమే. సీఎం విహార యాత్రకు వచ్చినట్లు వచ్చి వెళ్లిపోయారు తప్ప రైతులకు ఎలాంటి హామీ ఇవ్వలేదు. కేవలం కేరళలో జరిగే ఎన్నికల ఫండ్ కోసమే దేవాదులపై సమీక్షలు చేస్తున్నారు.
దేవాదుల మూడో ఫేజ్‌ను రూ.17,000 కోట్ల వ్యయంతో పూర్తిచేస్తామని చెప్పి, ఇప్పుడు రూ. 24,000 కోట్లకు అంచనాలు ఎలా పెంచారు? పెంచిన రూ.7 వేల కోట్లు కాంట్రాక్టర్ల నుంచి దండుకోవడానికే. రేవంత్ ప్రభుత్వ మోసాలను ప్రజలు గమనించాలి. కేసీఆర్, కేటీఆర్ దృష్టికి దేవాదుల అంశాన్ని తీసుకెళ్తాం. రానున్న రోజుల్లో రైతుల పక్షాన ఆందోళనలు చేపడతాం. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను గాలికి వొదిలేయమన్న రేవంత్‌రెడ్డి గతంలో కాళేశ్వరం కూలేశ్వరమైందన్నడు. కాళేశ్వరంపై సీఎం రోజుకో మాట మాట్లాడుతూ తన చిల్లరతనాన్ని చాటుకున్నాడు.రాబోయే రోజుల్లో రేవంత్‌రెడ్డికి చిప్పకూడు తప్పదు.
– పెద్ది సుదర్శన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే
రైతులకు ఒరిగిందేమీ లేదు
సీఎం రేవంత్‌రెడ్డి మాటలు జోకర్‌ను తలిపించేలా ఉన్నాయి. శాసన సభాపక్ష ఉపనేత హరీశ్‌రావు వచ్చి వెళ్లిన 24 గంటల్లోనే సీఎం తన మంత్రులతో కలిసి దేవాదుల ప్రాజెక్టు పరిశీలించేందు కు గాలిలో వచ్చి గాలిలోనే వెళ్లి పోయారు. దేవాదుల ప్రాజెక్టు విషయంలో సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు పొంతన లేకుండా మా ట్లాడుతున్నారు. సీఎం పర్యటనతో రైతాంగానికి ఒరిగిందేమి లేదు. రాష్ట్రంలో పంటలు ఎండుతుంటే ప్రభుత్వం రాక్షసానందం పొం దుతున్నది. కాంగ్రెస్ పార్టీకి మళ్లీ పిండాలు పెట్టే సమయం వచ్చిం ది. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేనందుకు స్టేషన్‌ఘన్‌పూర్‌లో కడియం శ్రీహరికి పిండాలు పెట్టె కార్యక్రమం చేపడతాం. కడియం దేవాదుల వద్ద రెండుసార్లు బొంద తవ్వి వెళ్లిపోయాడే తప్ప తట్టె డు మట్టి తీయలేదు.
ఆ సమయంలో అక్కడికి వెళ్లి పిండాలు పె ట్టాం. 2003లో గంగారం వద్ద చంద్రబాబుతో కలిసి కడియం ప నులకు శంకుస్థాపన చేసి నెలలు గడిచినా పనులు ప్రారంభించకపోవడంతో అప్పుడు కూడా పిండాలు పెట్టాం. ఇచ్చిన హామీలు కేసీఆర్ రూ.7 వేలకోట్లు కేటాయించి దేవాదుల ఫేజ్ 1, ఫేజ్ 2ను పూర్తి చేసి, ఫేజ్ 3 పనులు ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో తట్టెడు మట్టి తీయలేదు. రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి రైతులు కర్రు కాల్చి వాతపెట్టడం ఖాయం.
– డాక్టర్ తాటికొండ రాజయ్య, మాజీ ఉప ముఖ్యమంత్రి