ప్రపంచ సినీ వేదికపై భారతీయ సినిమాకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక బ్రిటీష్ అకాడమీ ఆఫ్ ఫిల్మ్ అండ్ టీవీ ఆర్ట్స్‌లో (బాఫ్టా) మణిపురి చిత్రం ‘బూంగ్’ పురస్కారాన్ని గెలుచుకుంది. బెస్ట్ చిల్డ్రన్ అండ్ ఫ్యామిలీ కేటగిరీలో ఈ చిత్రాన్ని ఎంపిక చేశారు. ఈ విభాగంలో పురస్కారాన్ని అందుకున్న తొలి భారతీయ సినిమాగా ‘బూంగ్’ చరిత్ర సృష్టించింది. లక్ష్మీ ప్రియా దేవి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ఫర్హాన్ అక్తర్ నిర్మించారు. గుగున్ కిబ్జెన్, బాలా హిజమ్ నిగ్తోజమ్, అన్గామ్ సనామాటుమ్ కీలక పాత్రల్ని పోషించారు.
మణిపూర్ జాతుల సంఘర్షణ, సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో బూంగ్ అనే బాలుడు తన కుటుంబాన్ని కలపడానికి చేసే ప్రయత్నం నేపథ్యంలో మానవీయ కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల చిత్రాలను అధిగమించి ‘బూంగ్’ అవార్డును కైవసం చేసుకుంది. బూంగ్ ‘బాఫ్టా’ అవార్డును గెలుచుకోవడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతోషం వ్యక్తం చేశారు. ఇది భారతీయ సృజనాత్మక కౌశలానికి దక్కిన గొప్ప గౌరవమని ఎక్స్ వేదికగా ఆయన చిత్రబృందాన్ని అభినందించారు.