వీర్నపల్లి : విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ ఓ ద్విచక్రవాహనదారుడిని లిప్ట్ అడగడమే ఆ అంగన్ వాడీ టీచర్ పాలిట శాపమైంది. అతడ బైకును వేరేదారికి మళ్లించడంతో భయపడి కిందకు దూకింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి చేరుకుంది. ఆ తర్వాత చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచింది.
వివరాల్లోకి వెళ్తే.. వీర్నపల్లి మండలం మద్దిమల్లకు చెందిన మాజోజు స్వరూప (52) లోద్ది తండాలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తోంది. ఈ నెల 7న విధులు ముగించుకుని ఇంటికి వెళ్తూ.. బైక్‌పై వెళ్తున్న ఓ వ్యక్తిని లిప్ట్ అడిగింది. గ్రామ శివారులోకి చేరుకోగానే యువకుడు మద్దిమల్ల వెళ్లకుండా బైకును వేగంగా అటవీప్రాంతంలోకి మళ్లించాడు.
దాంతో భయపడ్డ స్వరూప బైక్ పైనుంచి దూకింది. తలకు తీవ్ర గాయం కావడంతో అపస్మారక స్థితిలోకి చేరుకుంది. స్థానికులు గమనించి ఆమెను వెంటనే అంబులెన్స్‌లో ఎల్లారెడ్డిపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడి శుక్రవారం ఆమె మృతిచెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిరిసిల్ల జిల్లా దవాఖానకు తరలించారు. మృతురాలి కుమారుడు విష్ణు సాగర్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.