Illegal Fish Farming | పెద్దపల్లి, జూన్ 4 (నమస్తే తెలంగాణ) : కొంత మంది అక్రమార్కుల ధనాపేక్ష రాష్ట్ర ప్రజల ప్రాణాల మీదికి తెచ్చే ప్రమాదం ఉంది. పెద్దపల్లి జిల్లాలోని అంతర్గాం మండలం శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో గల 150 ఎకరాల విస్తీర్ణంలోని ఇరిగేషన్ భూములను యధేచ్చగా కబ్జా చేసి దాదాపుగా 36వరకు చేపల చెరువులను తవ్వి వాటిల్లో చేపలను పెంచుతూ వాటికి ఆహారంగా ప్రతీ రోజు టన్నుల కొద్దీ కోళ్ల వ్యర్థాలను వేస్తూ అక్రమ వ్యాపారానికి తెర లేపారు. సమీప గ్రామాలకు చెందిన నలుగురితోపాటుగా మరో 7మంది పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఇక్కడ ఒక ముఠాగా ఏర్పడి చేపల చెరువులను నిర్వహిస్తున్నారు.
ఈ విషయమై నమస్తే తెలంగాణ గత రెండు రోజులుగా వరుస కథనాలను ప్రచురిస్తున్నా.. అధికార పార్టీ నాయకుల, జిల్లా ఉన్నతాధికారుల అండదండలతో అక్రమార్కులు చెలరేగిపోతున్నారు. తమ ఆక్రమణలకు, అక్రమాలకు అడ్డూ అదుపూ ఉండదని వారు చెప్పకనే చెబుతున్నారు. ఎంతటి వారినైనా తాము తమ బలాలతో లోబర్చుకుంటామని సెలవిస్తున్నారు. ఎల్లంపల్లి ఎఫ్‌టీఎల్‌లోనే ఉన్నా హైడ్రా కానీ రెవెన్యూ, ఇరిగేషన్, పోలీసు శాఖలు తమను ఏమీ చేయలేరని వారు విర్రవీగుతున్నారు. ఇదిలా ఉండగా వీరు ఏకంగా ఎల్లంపల్లి ప్రాజెక్టును పూర్తిగా కలుషితం చేస్తున్నారు.
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని కరీంనగర్, రామగుండం కార్పోరేషన్ పరిధిలోని చికెన్, మటన్ సెంటర్ల నుంచి ప్రతీ రోజు వ్యర్థాలను సేకరించి ఆ చేపల చెరువుల్లో చేపలకు మేతగా ఉడికించి మరీ పెడుతూ 6 నెలల్లో కిలో సైజు వరకు పెరగాల్సిన చేపలను కేవలం 3 నెలల్లోనే పెంచుతూ ప్రజలను అనారోగ్యం బారిన పడే విధంగా హైదరాబాద్‌తో పాటుగా వివిధ ప్రాంతాలకు ఇక్కడి నుంచి చేపలను టన్నులకొద్దీ ఎగుమతి చేస్తున్నారు. అయితే ఇందులో మరో ఘోరం ఏమిటంటే.. ఈ చేపల చెరువుల దిగువనే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పైపుల ద్వారా ఆ చెరువుల్లోని నీటిని దిగువన గల ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వదులుతున్నారు.
హైదరాబాద్ వాటర్ సప్లైకి వాటర్ గ్రిడ్‌కు కలుషిత నీరు..
ఎల్లంపల్లి ఎగువన అక్రమార్కులు కబ్జా చేసిన చెరువుల్లో ప్రతీ రోజు చేపలకు ఆహారంగా కోళ్ల కాళ్లు, ప్రేగులు, తోళ్లు, వెంట్రుకలు, మేక మాంసానికి చెందిన బక్కీ తదితరాలను ప్రతీ రోజు ప్రత్యేకంగా వారు ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో కరీంనగర్, రామగుండం కార్పోరేషన్ల పరిధిలోని చికెన్, మటన్ సెంటర్ల నుంచి వ్యర్థాలను సేకరించి రాత్రి పూట వాటిని లోడింగ్ చేసుకొని చేపల చెరువుల వద్దకు వచ్చి అక్కడ వాటిని ఉడికించే చేపలకు మేతగా వేస్తున్నారు. ఇందుకు సంబంధించి చేపల చెరువు వద్ద ప్రత్యేక పాత్రను ఏర్పాటు చేసి నేరుగా ఆయా వ్యాన్ల నుంచి ఆ పాత్రలో వేసి ఉడికించి నేరుగా చెరువుల్లోకి వదులుతున్నారు. ఇలా చేపల చెరువుల్లోకి వదిలిన వ్యర్థాలను చేపలు తింటూ తొందరగా బరువు పెరుగుతున్నాయి. 15-20రోజుల తర్వాత ఆ నీటిని మార్చుతున్నారు. ఆ సమయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మోటార్ల ద్వారా చెరువుల్లోకి నీళ్లను నింపుకుంటుండగా.. చెరువుల్లోని నీటిని దిగువన గల ఎల్లంపల్లి లోకి వదులుతున్నారు.
ఈ చెరువుల దిగువనే హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ స్కీం ద్వారా రావాటర్ సప్లె ప్రతీ రోజు కొనసాగుతుంది. ఈ హెచ్ఎండబ్ల్యూఎస్ స్కీం ద్వారా ప్రతీ రోజు 177.88 ఎంజీడీల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇక్కడి నుంచి పైప్లైన్ల ద్వారా రావాటర్ నేరుగా సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ట్రీట్మెంట్ ప్లాంట్‌కు వెళుతుంది. అదే విధంగా అంతర్గాం మండలం ముర్మూర్‌లో గల 160ఎంఎల్డీ నీటి శుద్ది కేంద్రం వాటర్ గ్రిడ్‌కు సైతం ఈ చెరువుల నుంచి వచ్చే దుర్గంధమైన నీరు అందుతుంది. వాటర్ గ్రిడ్‌లో వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉండగా హైదరాబాద్‌కు మాత్రం నేరుగా రావాటర్ సప్లె జరుగుతోంది. ఇలా ఎల్లంపల్లి భూములను కబ్జా చేస్తున్నా.. అక్రమంగా చెరువులు తవ్వినా.. ఏకంగా ఎల్లంపల్లి నీటిని కలుషితం చేస్తున్న అక్రమార్కులపై మాత్రం చర్యలకు ఎందుకు ప్రభుత్వం, అధికారులు వెనకాడుతున్నారో అంతుచిక్కడం లేదు.
ప్రజారోగ్యంతో చెలగాటం..
చికెన్, మటన్‌తో పోల్చుకుంటే ఫ్యాట్స్ తక్కువగా ఉంటుందని చేపలు తినేవారికి ఇలాంటి చేపల చెరువుల గరించి తెలిస్తే షాక్ అవుతారు. గోదావరి, మానేరు నదుల్లో, మంచినీటి చేపల చెరువుల్లో లభించే చేపలంటే ప్రజలు లొట్టలేసుకొని తింటారు. కానీ ఇలాంటి అక్రమమైన చెరువుల్లో పెంచే చేపలు తింటే మాత్రం అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. ఎందుకంటే.. చేపలకు వేస్తున్న మేత ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని వైద్యులు చెబుతున్నారు. చేపల మేతకు అవసరమైన ముడి పదార్థాల ధరలు పెరగడంతో చికెన్, మటన్ వ్యర్ధాలను చేపలకు ఆహారంగా ఉడికించి మేతగా వినియోగిస్తున్నారు. ఇది కాసులు కురి పిస్తుండటంతో కోళ్ల వ్యర్ధాల వ్యాపారానికి ఎల్లంపల్లి అడ్డాగా మారింది. ప్రతి రోజూ కరీంనగర్, గోదావరిఖనిల నుంచి వందల టన్నుల చికెన్ వేస్ట్‌ను అక్రమంగా ఇక్కడికి తీసుకువచ్చి కోళ్ల వ్యర్థాలతో చేపలను పెంచుతున్నారు. ఇది చట్టవిరుద్ధమైనప్పటికీ యథేచ్చగా ఈ దందాను కొనసాగిస్తున్నారు.
రాత్రి లోడింగ్, రవాణా..
ఎల్లంపల్లి అక్రమ చెరువుల్లోని చేపలకు మేతగా కరీంనగర్, గోదావరిఖని కార్పోరేషన్ల పరిధిలోని చికెన్ షాపుల్లోని వ్యర్థాలతోపాటుగా మురిగిపోయి, పాడైన మాంసాన్ని, ప్రత్యేకంగా సేకరిస్తున్నారు. అనంతరం వాటిని చీకటి పడ్డాక రాత్రి 9-11గం.ల మధ్య ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న వాహనాల్లో ఇక్కడికి తీసుకువచ్చి వాటిని ఉడికించి చేపలకు మేతగా వేస్తున్నారు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నా చర్యలు మాత్రం శూన్యం.
ఫిషరీస్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా చర్యలు శూన్యం..
ఎల్లంపల్లి భూముల కబ్జాతోపాటు కబ్జా చేసిన భూముల్లో చికెన్ మార్కెట్లోని విషతుల్యమైన కోళ్ల వ్యర్థాలు చెరువుల్లో వేసి చేపలను పెంచుతున్నారనే స్థానికుల ఫిర్యాదు మేరకు పెద్దపల్లి జిల్లా మత్స్య శాఖ అధికారి నరేష్కుమార్ నాయుడు అంతర్గాం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 15 రోజుల క్రితం వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా చర్యలు తీసుకుంటామని చెప్పినప్పటికీ చర్యలు తీసుకోలేదు. వెంటనే చెరువుల నిర్వహకులను తీసుకువచ్చి బైండోవర్ చేస్తామని, ఆ సమాచారం మత్స్యశాఖ అధికారులకు ఇస్తామని పోలీసులకు చెప్పగా.. ఇప్పటివరకు దాదాపుగా 15 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు వాళ్లపై కేసు పెట్టినట్లుగా కానీ.. వారిని బైండోవర్ చేసినట్లుగా కానీ పోలీసులు ప్రకటించలేదు. ఇలా అక్రమార్కులకు అంతటా అండదండలే కనిపిస్తున్నాయని స్థానికులు వాపోతున్నారు.
ACB Summons: 2 వేల కోట్ల స్కామ్‌లో సిసోడియా, సత్యేంద్రకు ఏసీబీ సమన్లు
MLC Kavitha | కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే నోటీసులు.. రేవంత్ సర్కారుపై కవిత ఫైర్..
Karimnagar | తాళం వేసి ఉన్న ఇంట్లో చోరీ.. నగదు, బియ్యం బస్తాలు ఎత్తుకెళ్లిన దొంగలు