కోల్‌సిటీ, జూన్ 22 : ‘తెలంగాణ అమరవీరులకు జోహార్. మీ త్యాగాలను వృథా కానీయం. 4 కోట్ల తెలంగాణ ప్రజల గుండెల్లో శ్వాసగా మీరు బతికే ఉన్నరు. మీ త్యాగంతోనే తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చింది. ఏమిచ్చి మీ రుణం తీర్చుకోలేం. మీ కుటుంబాలను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటాం’ అంటూ రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ భావోద్వేగానికి లోనయ్యారు. దశాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా గురువారం రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో అమరవీరుల సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. ముందుగా అమరవీరుల కుటుంబాలతో కలిసి ఆయన అల్పాహారం చేశారు. ఆ తర్వాత ర్యాలీగా గోదావరిఖని ప్రధాన చౌరస్తాకు చేరుకొని అమరవీరుల స్మారక స్తూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం అమరవీరుల కుటుంబ సభ్యులను సన్మానించి మొక్కలు అందజేశారు. ముగింపు సభలో సాంస్కృతిక కళాకారులు అలనాటి ఉద్యమ జ్ఞాపకాలు, అమరుల త్యాగాలపై పాడిన పాటలు భావోద్వేగానికి గురిచేశాయి.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చందర్ మాట్లాడుతూ.. నాడు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమ సారథి కేసీఆర్ చేపట్టిన పోరాటంలో సకల జనులు సమష్టిగా ఉద్యమించిన చరిత్రను భావితరాలు గర్వంగా చెప్పుకుంటాయన్నారు. ఉద్యమ సమయంలో సీమాంధ్రుల కుట్రలను చూసి రాష్ట్రం రాదేమో అన్న బెంగతో ఎంతోమంది ప్రాణత్యాగాలు చేశారని, వారి కుటుంబాలను కేసీఆర్ ప్రభుత్వం కడుపులో పెట్టుకొని చూసుకుంటుందన్నారు. కేసీఆర్ కూడా చావును ముద్దాడి తెలంగాణ తెచ్చాడని, ఏండ్ల పోరాటం ఫలితంగా వచ్చిన తెలంగాణను అంతకంటే వేగంగా అభివృద్ధిలోకి తీసుకొచ్చాడని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని బీఆర్ అంబేద్కర్ సెక్రటేరియట్ వద్ద అమరవీరుల అఖండ జ్యోతిని నిర్మించారని తెలిపారు.
ఒక రాష్ట్రం కోసం అమరులైన వారికి ఇంత గుర్తింపు ప్రపంచంలోనే మరెక్కడా ఉండబోదన్నారు. పోయి పోయి మళ్లీ తెలంగాణను కుట్రదారుల చేతుల్లో పెడితే అమరవీరుల ఆత్మ కూడా శాంతించదన్నారు. తనను ఆదరించి నియోజకవర్గ అభివృద్ధి కాంక్షించి గెలిపించిన ప్రజలకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్, కొప్పుల ఈశ్వర్ సహకారంతో రామగుండాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకవచ్చానని, ఇంకా చేయాల్సింది మున్ముందు చాలా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మేయర్ అనిల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్ రావు, కమిషనర్ బీ సుమన్ రావు, కార్పొరేటర్లు ఇంజపురి పులెందర్, ధాతు శ్రీనివాస్, పెంట రాజేశ్, కన్నూరి సతీశ్, రాజ్‌కుమార్, జనగామ కవిత, కృష్ణవేణి, అంజలిదేవి, అడ్డాల స్వరూప, బుచ్చిరెడ్డి, నాయకులు దేవి లక్ష్మీనర్సయ్య, నీరటి శ్రీనివాస్, బెందె నాగభూషణ్ గౌడ్, మేజిక్ రాజా, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.