Mamatha Hospital | పెద్దపల్లి, ఏప్రిల్29: డీఎంహెచ్‌వో డాక్టర్ అన్న ప్రసన్న కుమారిని బెదిరించి, భయబ్రాంతులకు గురి చేసిన వారిపై, గోదావరిఖని మమత హాస్పిటల్ యాజమాన్యంపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు బొంకూరి శంకర్ అన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో వైద్య ఉద్యోగులతో కలిసి ఇవాళ మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్ కోయ శ్రీహర్షకు వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా శంకర్ మాట్లాడుతూ.. ఈ నెల 26న డీఎంహెచ్‌వో విధి నిర్వహణలో భాగంగా గోదావరిఖనిలోని మమత హాస్పిటల్‌ను తనిఖీ చేయగా.. అందులో అనుమతి లేని అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్‌ను గుర్తించి సీజ్ చేస్తుండగా,హాస్పిటల్ వైద్యులు, సిబ్బంది, ఇతర వ్యక్తులు కలిసి డీఎంహెచ్‌వోను భయబ్రాంతులకు గురి చేస్తూ చంపేస్తామని బెదిరించారని కలెక్టర్‌కు వివరించారు.
ఆ దవాఖానలో పని చేస్తున్న ప్రభుత్వ వైద్యులు నాగిరెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఆర్జే స్వాతిని సస్పెండ్ చేయాలని కోరారు. ఈ దౌర్జన్యంలో పాల్గొన్న డాక్టర్ బీ అనిల్ కుమార్‌పై తగిన చర్యలు తీసుకుంటూ మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్‌ను రద్దు చేయుటకు మెడికల్ కౌన్సిల్ బోర్డుకు సిఫారసు చేయాలని కలెక్టర్‌ను కోరారు. అలాగే మహాంకాళిస్వామి, రిసెప్షనిస్ట్ ఆనంద్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. డీఎంహెచ్‌వోపై ఆక్రమ కేసు బనాయించిన ఆనంద్ కేసు ఉపసంహరించుకోవాలన్నారు. డీఎంహెచ్‌వోకు తగు రక్షణ కల్పించాలన్నారు.
ఈ కార్యక్రమంలో డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ బీ శ్రీరాములు, డాక్టర్ కిరణ్ కుమార్, టీఎన్జీవో హెల్త్ ఫోరం అధ్యక్షుడు వీరగోని శ్రీనివాస్, టీజీవో హెల్త్ ఫోరం అధ్యక్షుడు ఉమమహేశ్వర్, రాష్ట్ర పారామెడికల్ ఆఫీసర్ల ఫోరం అధ్యక్షుడు దేవీ సింగ్, ఆర్బీఎస్ కే వైద్యులు రమేష్, రాజేష్, సాలమ్మ, దయామణి, సిబ్బంది పాల్గొన్నారు.
BRS | వరంగల్ సభతో కాంగ్రెస్ పతనం ప్రారంభం : బీఆర్ఎస్ నాయకులు
Mayday | మేడేను విజయవంతం చేయండి : సీపీఐ నాయకులు
Sircilla | ఇంట్లో చోరీకి యత్నించిన ఏఎస్ఐ.. పట్టుబడటంతో దేహశుద్ధి