రామగిరి మార్చి 12: ఇసుక లారీల(Sand trucks) ద్వారా ప్రమాదాలకు కారకుడైన మంథని ఎమ్మెల్యే, మంత్రి దుద్దిల్ల శ్రీధర్‌పై కేసు నమోదు చేసి పోలీసులు చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ డిమాండ్ చేశారు. రామగిరి మండలంలోని కల్వచర్లలో ఇసుక లారీ ప్రమాదంలో మృతి చెందిన దొంతుల శ్రీవాణి కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తాను గెలిచిన తర్వాత రెండు రోజుల్లోనే ఇసుక రవాణాను బంద్ చేయిస్తా అని ప్రగల్భాలు పలికిన మంత్రి పదిహేను నెలలైనా ఎందుకు పట్టించుకోవడం లేదో మంథని ప్రజలు ఆలోచన చేయాలన్నారు.
రెండు రోజుల్లోనే ఇసుక బంద్ చేయిస్తా అని 24 గంటల రవాణాకు తెరలేపి 15 నెలలుగా ఇసుక రవాణా ఆపడంలో మంత్రి నిర్లక్ష్యం మూలంగానే సుమారు 35 మంది బలయ్యారన్నారు. అందుకు కారణమైన ప్రభుత్వ బాధ్యునిగా దుద్దిల్ల శ్రీధర్‌పై 106 బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తాము అధికారంలో ఉండగా ప్రమాదాలు జరిగితే గగ్గోలు పెట్టిన మంత్రికి రక్తపు మరకలు అంటవద్దని ఇప్పుడు పోలీసులు ఏకంగా ప్రమాద స్థలాన్ని నీళ్లు పోసి కడిగేస్తున్నారా? అని ఆయన ప్రశ్నించారు.
తాము ప్రమాదం జరిగిన సమయంలో బాధితులకు అండగా నిలిచి రూ.30 లక్షల వరకు నష్టపరిహారం ఇప్పించామని ఇప్పుడు మంత్రిగా ఉన్న దుద్దిల్ల శ్రీధర్ మృతుల కుటుంబాల పట్ల అవలంభిస్తున్న నిర్లక్ష్య వైఖరిని మానుకుని రూ.50 లక్షల నష్టపరిహారం ఇప్పించాలన్నారు. సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పూదరి సత్యనారాయణగౌడ్, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు శెంకేషి రవిందర్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు కాపురవేన భాస్కర్, శేఖర్, నాయకులు ఆసం తిరుపతి, మల్యాల మోహన్, సైండ్ల సత్యం, రేండ్ల అశోక్, స్వామి, రాము, పోశం తదితరులు పాల్గొన్నారు.