Peddapalli | రామగిరి, డిసెంబర్ 29: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సోమవారం తెల్లవారుజామున రామగిరి పోలీసులు పలువురు బీఆర్ఎస్ నాయకులు, ఆశా వర్కర్లను ముందస్తుగా అరెస్ట్ చేశారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఈ సందర్భంగా ప్రజాస్వామ్యవాదులు ఆరోపించారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను అణిచివేసేందుకు ముందస్తు అరెస్టులకు పాల్పడుతోందని తీవ్రంగా విమర్శించారు. ప్రజా ప్రతినిధులు, నాయకుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని వారు ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో నిరసన వ్యక్తీకరణకు హక్కు ఉందని, శాంతియుతంగా తమ డిమాండ్లు వినిపించాలనుకున్న నాయకులు, ఆశా వర్కర్లను అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పలువురు నాయకులు వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా రానున్న రోజుల్లో ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ ముందస్తు అరెస్టులపై స్పందించిన పోలీసులు, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ముందస్తు జాగ్రత్త చర్యలుగా అరెస్టులు చేశామని స్పష్టం చేశారు.