ధర్మారం,ఫిబ్రవరి 18: ఈ నెల ఒకటిన పార్లమెంటులో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కార్మిక, కర్షక వ్యతిరేక బడ్జెట్‌ను(Central budget) సవరించాలని సిఐటియు జిల్లా అధ్యక్షుడు ఎరవల్లి ముత్యంరావు డిమాండ్ చేశారు. బిజెపి ప్రభుత్వ కార్మిక వ్యతిరేక వైఖరిని నిరసిస్తూ కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ కార్మిక వర్గం ప్రభావం అంశం పై అనే అంశంపై సిఐటియు తరఫున ముద్రించిన కరపత్రాలు మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో విడుదల చేశారు.
ఈ సందర్భంగా ముత్యంరావు మాట్లాడుతూ దేశంలో సామాన్య ప్రజలపై భారాలను మోపుతూ కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే పీఎం నరేంద్ర మోదీ సర్కార్ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను నిరసిస్తూ పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. వ్యవసాయ రంగానికి మొదటి ప్రాధాన్యత అంటూనే రైతు రుణమాఫీ పథకం, ధరల స్థిరీకరణ చట్టానికి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన మండిపడ్డారు.
ఉపాధి హామీ పథకానికి నిధుల కోత పెట్టిందని, ఉద్యోగాల భర్తీకి ప్రణాళికలు లేవని, ఆర్థిక సంస్కరణలు అమలు చేసే రాష్ట్రాలకే కేంద్రం ఆర్ధికంగా సహకరిస్తుందని బాహాటంగా బడ్జెట్లో ప్రకటించడం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతమని ఆయన విమర్శించారు. ఈ నేపథ్యంలో బడ్జెట్‌ను రాష్ట్ర కార్మికవర్గం అంతా తీవ్రంగా వ్యతిరేకించాలన్నారు. ప్రజా అనుకూల బడ్జెట్‌గా మార్చకుంటే ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి సీపెల్లి రవిందర్, మండల అధ్యక్షుడు ఆకుల రాజయ్య, కార్మిక సంఘ నాయకులు మేడవేని రాయలింగు, శ్రీనివాస్, రాజు, కుమార్, రాజు, మల్లమ్మ, విజయ, అరుణ, నర్సమ్మ, నర్సయ్య, రైతులు, కార్మికులు తదితరులు పాల్గొన్నారు.