యాచారం, మార్చి 9: గ్రీన్ ఫీల్డ్ రోడ్డుకు ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేదిలేదని రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మర్లకుంటతండా, మంగలిగడ్డతండా, పోతుబండతండాలకు చెందిన గిరిజన రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు నిర్మాణంలో భాగంగా భూములు కోల్పోతున్న సదరు తండాల రైతులతో సోమవారం తహసీల్దార్ కార్యాలయంలో ఆర్డీవో అనంతరెడ్డి సమావేశమయ్యారు. గ్రీన్ఫీల్డ్ రోడ్డు ఏర్పాటుకు రైతులు భూములిచ్చి సహకరించాలని ఆయన కోరారు. రోడ్డు నిర్మాణం కోసం మూడు తండాలకు చెందిన 35 ఎకరాల భూమిని సేకరించనున్నట్టు పేర్కొన్నారు. భూములు కోల్పోతున్న రైతులకు తగిన పరిహారం ఇస్తామని తెలిపారు. కానీ రైతులు మాత్రం అందుకు ససేమిరా అన్నారు. బతుకుదెరువు లేకుండా చేసే అభివృద్ధి తమకెందుకని ప్రశ్నించారు. ఇప్పటికే ఫార్మాసిటీ కోసం అసైన్డ్, పట్టా భూములు సేకరించారని, ఇప్పుడు ఉన్న కాస్త భూమిని గ్రీన్ఫీల్డ్ రోడ్డు కోసం గుంజుకుంటే తామెలా బతకాలని వారు ప్రశ్నించారు. గిరిజన రైతుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతున్నదని మండిపడ్డారు. ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ నాయకుడు శ్రీకాంత్ నాయక్ మాట్లాడుతూ.. అధికారులు ఎన్ని విధాలుగా మభ్యపెట్టినా రైతుల నిర్ణయం మారదని స్పష్టం చేశారు. పరిహారానికి బదులుగా భూమికి భూమి ఇవ్వాలని సూచించారు. రైతులకు నచ్చినచోట ప్రభుత్వమే భూములను కొనివ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే భూములను ఇచ్చే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెప్పారు.