రాజన్న సిరిసిల్ల, జూలై 23 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ 50వ పుట్టిన రోజును పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ముందస్తుగా గురువారం ఘనంగా నిర్వహించారు. ‘గిఫ్ట్ ఏ స్మైల్’ భాగంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో ఘనంగా జరుపుకున్నారు. గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ కార్మికులు, సిబ్బంది, పేదలు మొత్తం 50 మందికి ఉపసర్పంచ్ లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి దుస్తులను పంపిణీ చేశారు.
ఎల్లారెడ్డిపేట మండలం బండలింగంపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివి ట్రిపుల్ ఐటీ సీటు సాధించిన విద్యార్థి శ్రీరామోజు అఖిల్‌కు సర్పంచ్ బాల్‌రాజ్ నర్సాగౌడ్ రూ.20 వేల విలువైన ట్యాబ్‌ను అందించి ఉదారతను చాటుకున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు వ్యాల్ల హరీశ్‌రెడ్డి స్థానిక మార్కండేయకాలనీలోని శ్రీలక్ష్మీ ఫంక్షన్హల్లో 42 మంది ఆటో డ్రైవర్ల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున రూ.4.20 లక్షల ఆర్థిక సాయం అందజేశారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పాల్గొన్నారు. పెద్దపల్లి ప్రభుత్వ దవాఖానలో టీఎస్టీఎస్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చిరుమిల్ల రాకేశ్‌కుమార్ ఆధ్వర్యంలో రోగులకు పండ్లు, బ్రెడ్లు పంపిణీ చేశారు.
కరీంనగర్‌లోని నియో హెల్పింగ్ హ్యాండ్స్ అనాథ శరణాలయంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్ ఆధ్వర్యంలో రెండు నెలలకు సరిపడా నిత్యావసర సరుకులను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలోని తిర్మలాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ చెట్పెల్లి హరేందర్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో చికిత్స పొందుతుండగా, బీఆర్ఎస్ మండల కార్యకర్తలు తల కొన్ని డబ్బులు జమ చేసి రూ.52 వేల నగదును అతని భార్య లతకు దవాఖానలో అందచేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల ‘హ్యాపీ బర్త్‌డే కేటీఆర్’ అంటూ శుభాకాంక్షలు తెలిపారు. రామన్న నిండు నూరేళ్లూ చల్లంగా ఉండాలని ఆకాంక్షించారు. ఆయన ఆపన్నులకు ఆపద్బాంధవుడని, సిరిసిల్ల ప్రగతి సాధకుడని కొనియాడారు.