నారాయణపేట, జూలై 23 : వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన నారాయణపేటలో రైతు కుటుంబాల పిల్లలకు ప్రభుత్వ ఖర్చుతో వ్యవసాయ విద్యనందించాలనే ఉద్దేశంతో పేట జిల్లాకేంద్రంలో ఏర్పాటు చేసిన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను నాగర్‌కర్నూల్ జిల్లా పాలెంకు తరలించడం వల్ల మరోమారు వెనుకబడిన నారాయణపేట జిల్లాకు తీరని అన్యాయం జరిగినట్లు అయింది. ఇంత జరిగినా ఈ విషయంపై ప్రజాప్రతినిధులు స్పందించకపోవడం ఎంతో బాధాకరమని విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రైతు సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నారాయణపేట జిల్లాలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల ఏర్పాటు చేయడంతో ఈ ప్రాంత విద్యార్థులకు తకువ ఖర్చుతో డిప్లొమా వ్యవసాయ విద్యను అందించడంతోపాటు విద్యార్థులు చేపట్టే పంట పొలాల పరిశోధనల వల్ల పరోక్షంగా రైతులకు మేలు జరుగుతుందనే ఉద్దేశంతో అప్పటి ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డి అప్పటి సీఎం కేసీఆర్‌ను ఒప్పించి జిల్లాకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను అక్టోబర్ 27, 2022న జీవో. ఎం.ఎస్ నెంబర్ 36 ద్వారా మంజూరు చేయించారు. అంతే కాకుండా ఫస్టియర్ అడ్మిషన్లకు గానూ కేవలం 20సీట్లు ప్రభుత్వం కేటాయించగా అవి సరిపోవని ప్రభుత్వ పెద్దల దృష్టికి మరోమారు తీసుకెళ్లి 40సీట్లతో 2023లో జిల్లా కేంద్రంలో కళాశాలను ప్రారంభింపజేశారు.
ఇలా 2023 – 2024, 2024 – 2025 రెండు విద్యా సంవత్సరాల పాటు కొనసాగిన కళాశాల ఆ తర్వాత అధికారంలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గుట్టుచప్పుడు కాకుండా నాగర్‌కర్నూల్ జిల్లా పాలెంకు తరలించింది. రైతు కుటుంబాల విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతున్న ఈ విద్యాసంస్థను వేరే జిల్లాకు తరలించడం వల్ల నారాయణపేట జిల్లా విద్యా అభివృద్ధికి పెద్ద దెబ్బ అని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేటకు మంజూరైన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను యథాతథంగా కొనసాగించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు, ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. నారాయణపేట జిల్లాకు మంజూరైన అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను నాగర్‌కర్నూల్ జిల్లా పాలెంకు తరలిపోయిన విషయంపై జిల్లాలో తీవ్ర చర్చకు దారితీయడమే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.
అయినప్పటికీ ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులు మాత్రం కళాశాలను వెనకి తీసుక వస్తామనే విషయంపై ఒక మాట మాట్లాడిన దాఖలు లేవు. చేతనైతే కొత్తగా తమ ప్రాంతానికి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయించుకోవాలే తప్పా ఒక ప్రాంతానికి మంజూరైన కళాశాలను మరో ప్రాంతానికి తరలించడం ఎంతవరకు సమంజసమని ప్రజలు అభిప్రాయ పడుతున్నారు. నారాయణపేట జిల్లాలో ఇప్పటికే ఉన్నత విద్యాసంస్థలు చాలా తకువగా ఉన్నాయని, ఇలాంటి పరిస్థితిలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కూడా తరలిపోవడం వల్ల గ్రామీణ విద్యార్థులు దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, అదనపు ఖర్చు, వసతి సమస్యలు ఎదురవుతాయని తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. రైతు కుటుంబాలకు వ్యవసాయంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందించడంలో ఇలాంటి విద్యాసంస్థలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని నారాయణపేట వంటి వ్యవసాయ జిల్లాలో ఈ కళాశాల కొనసాగడం వల్ల రైతులకు కూడా పరోక్షంగా ప్రయోజనం చేకూరుతుందని వ్యవసాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వెనకబడిన నారాయణపేట జిల్లా అభివృద్ధికి విద్యాసంస్థలు అత్యంత అవస రం. ఇప్పటికే జిల్లాలో ప్రభు త్వ ఉన్నత విద్యాసంస్థలు తకువగా ఉన్నాయి. ఇలాం టి పరిస్థితుల్లో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను తిరిగి ఈ ప్రాంతానికి రప్పించడంలో స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభు త్వం తగిన నిర్ణయం తీసుకోవాలి.
– కోరం శివారెడ్డి, బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు
పూర్తిగా కర్ణాటక రాష్ట్ర సరిహద్దుకు ఆనుకొని ఉన్న నారాయణపేట జిల్లా వంటి ప్రాంతాల్లో ఉన్నత విద్యాలయాలను ఏర్పాటు చేయడంతో జిల్లా కొంతమేరకు విద్యాభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతో నారాయణపేటలో అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను ఏర్పాటు చేశారు. నారాయణపేట జిల్లాలోనే అగ్రికల్చర్ కళాశాలను కొనసాగించాలి. వేరే జిల్లాకు తరలించడం వల్ల పేద రైతు కుటుంబాలకు దూర ప్రాంతాల్లో పిల్లలను చదివించడం భారంగా మారుతుంది. అవసరం అయితే ఆ జిల్లాకు కొత్తగా అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలను మంజూరు చేయించాలి తప్పా ఈ ప్రాంతానికి మంజూరైన కళాశాలను ఇకడ నుంచి తరలించడం సరైంది కాదు. ఇప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతాం.
– ఎస్.రాజేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, నారాయణపేట