కూసుమంచి(నేలకొండపల్లి), జూలై 23 : పార్టీ బలోపేతమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేయాలని మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేలకొండపల్లి మండలం పైనంపల్లి గ్రామంలో బీఎల్ఏల సమావేశం మండల పార్టీ మాజీ అధ్యక్షుడు ఉన్నం బ్రహ్మయ్య అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా కందాల మాట్లాడుతూ పార్టీకి కార్యకర్తలే బలం అని, వారితోనే పార్టీకి మనుగడ ఉంటుందన్నారు. సమగ్ర ఓటరు జాబితా సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియలో ఒక్క ఓటు కూడా మిస్ కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత బీఎల్ఏలపై ఉందన్నారు. పార్టీకి ప్రతి ఓటరూ ముఖ్యమేనని, ఎన్యూమరేషన్ ఫారాల్లో తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
అలాగే ప్రజా సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందించాలని, ప్రజా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లే బాధ్యతను కూడా తీసుకోవాలన్నారు. పార్టీ గ్రామాల్లో బలంగా ఉంటేనే ఏ ఎన్నికల్లోన్నైనా విజయం సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా తాత్సారం చేస్తోందని, వాటిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రెండున్నరేళ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. కనిపిస్తున్న అభివృద్ధి అంతా కేసీఆర్ పదేళ్ల పాలనలో జరిగిందేనని ఆయన గుర్తు చేశారు. కార్యక్రమంలో రూరల్ మండల పార్టీ మాజీ అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్, జడ్పీ మాజీ వైస్ చైర్పర్సన్ మరికంటి ధనలక్ష్మి, సర్పంచ్ శీలం వెంకటలక్ష్మి, అన్ని గ్రామాల బీఎల్ఏలు పాల్గొన్నారు.