MLA Adluri Laxman Kumar | ధర్మారం, ఏప్రిల్ 21 : కేంద్రంలో పీఎం నరేంద్ర మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దేశంలోని రైతులకు ఒరగబెట్టింది ఏమీ లేదని ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలో పర్యటించిన లక్ష్మణ్ కుమార్ ధర్మారం వ్యవసాయ మార్కెట్ యార్డు, కమ్మర్ ఖాన్ పేట, లంబాడి తండా (కే) గ్రామాలలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. అనంతరం ఆయన ధర్మారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఫసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ చేసిన ఆరోపణలను లక్ష్మణ్ కుమార్ తీవ్రంగా ఖండించారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే నైతిక హక్కు అరవింద్‌కు లేదని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వంపై విమర్శలు చేసే ముందు ఎంపీ అరవింద్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతులకు ఏం మేలు చేసిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
రైతు సంక్షేమ పథకాలు ఏమీ లేవు..
11 సంవత్సరాలపాటు అధికారంలో కొనసాగుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల కోసం చేసిన సంక్షేమ పథకాలు ఏమీ లేవని ఆయన మండిపడ్డారు. రైతులకు మేలు చేయని కేంద్ర ప్రభుత్వం వారికి వ్యతిరేకంగా నల్ల చట్టాలను తీసుకువచ్చి వారిని నరకయాతనకు గురిచేసిందని లక్ష్మణ్ కుమార్ తెలిపారు. నల్ల చట్టాలను రద్దు పరచాలని ఆందోళన చేసిన ఎంతోమంది రైతులు మరణించారని ఆయన గుర్తు చేశారు.
రైతు వ్యతిరేకిగా ఉన్న కేంద్రప్రభుత్వం ఏ రోజు రైతుల పక్షాన లేదని అన్నారు. కేవలం రాజకీయ ఉనికి కోసం తమ ప్రభుత్వంపై ఎంపీ అరవింద్ ఎప్పుడు ఏవో ఆరోపణలు చేస్తూ ఉంటాడని వాటిని ప్రజలు ఎవరు పట్టించుకోరని అన్నారు. కేంద్ర ప్రభుత్వం కంటే తమ ప్రభుత్వమే రైతులకు ఎంతో మేలు చేస్తుందని ఆయన అన్నారు. ధర్మారం మండలానికి ఎన్ఆర్ఈజీఎస్ పథకం ద్వారా రూ.4 కోట్లు, ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా రూ.2 కోట్లు, స్పెషల్ ఫండ్ ద్వారా రూ.2 కోట్లు సీఆర్ఆర్ పథకం ద్వారా రూ.కోటి 50 లక్షలు, ఖిలావనపర్తిలోని పోచమ్మ గుడి వద్ద వంతెన నిర్మాణానికి రూ.కోటి 30 లక్షలు నిధులు మంజూరైనట్లు లక్ష్మణ్ కుమార్ వెల్లడించారు.
అనంతరం వచ్చే నెలలో ఖిలా వనపర్తి గ్రామంలో నిర్వహించే శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర ఉత్సవాల పోస్టర్లను దేవాదాయ, ధర్మాదాయ శాఖ ఈవో కాంతారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ పోలు దాసరి సంతోష్ విడుదల చేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గాగిరెడ్డి తిరుపతిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్ల నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, డైరెక్టర్లు మాజీ ఎంపీపీ కొడారి హన్మయ్య, ఏఎంసీ మాజీ చైర్మన్ కొత్త నరసింహం, జిల్లా కాంగ్రెస్ సేవాదళ్ అధ్యక్షుడు బొల్లి స్వామి, పార్టీ బ్లాక్ టు అధ్యక్షుడు కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఆశోద అజయ్ కుమార్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సోగాల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Drinking Water | మిషన్ భగీరథపై అధికారుల నిర్లక్ష్యం.. నీరు వృథాగా పోతున్నా పట్టింపు కరువు
Kollapur Mangos | కొల్లాపూర్ మామిడి రైతులను ఆదుకోవాలి : బీఆర్ఎస్ నాయకులు అభిలాష్ రావు
Rayapol ZPHS | విద్యా వెలుగులకు నెలవై.. రాయపోల్ పెద్ద బడికి నేటికి 60 వసంతాలు