కొల్లాపూర్ : నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ప్రాంత మామిడి (Kollapur Mangos ) రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రంగినేని అభిలాష్ రావు ( Abhilash Rao) ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత రెండు రోజుల పాటు ప్రకృతి వైపరీత్యం వల్ల మామిడి రైతులకు భారీ నష్టం వాటిల్లిందన్నారు.
2024 సంవత్సరం లెక్కల ప్రకారం నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా 33,841.91 ఎకరాలలో మామిడి తోటలు సాగు అవుతుంటే కొల్లాపూర్ ప్రాంతంలోని కేవలం నాలుగు మండలాల పరిధిలోనే 23,789.33 ఎకరాలలో మామిడి తోటలు సాగవుతున్నాయని వెల్లడించారు. 2025 సంవత్సరంలో మామిడి తోటల సాగు పెరిగినా ప్రభుత్వం అందించే ప్రోత్సాహకం పూర్తిస్థాయిలో తగ్గిపోయిందని ఆరోపించారు.
రుణమాఫీ చేయకపోవడం, రైతు భరోసాను పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో రైతులు దళారుల వద్ద ఎకరాకు రెండు లక్షల వరకు అప్పులు తెచ్చుకొని సాగు చేసుకున్నారని వివరించారు. మామిడి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం పంట నష్టంపై అంచనా వేయలేదన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు తోటల వైపు కన్నెత్తి చూడలేదని విమర్శించారు. కొల్లాపూర్, కోడేరు పెద్దకొత్తపల్లి మండలాల పరిధిలో 10 నుంచి 20 సంవత్సరాల వయసు కలిగిన మామిడి చెట్లు ఈదురుగాలుల దాటికి నేలమట్టమైనట్లు తెలిపారు.
వందల టన్నులకొద్దీ మామిడి కాయలు నేలకు రాలడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మామిడి తోటలో జరిగిన నష్టంపై అంచనాలను రూపొందించి ప్రభుత్వానికి నివేదికలు పంపించాలని డిమాండ్ చేశారు.