సుల్తానాబాద్ రూరల్, జూన్ 22: తమ గ్రామంలో పదేండ్ల క్రితం మూతబడిన సర్కారు బడిని (Government School) తిరిగి తెరవాలని ప్రజలు కోరుతున్నారు. ప్రైవేటులో ఖర్చులు భరించలేకపోతున్నామని, మళ్లీ మా ఊర్లో ఉన్న పాఠశాలను ఓపెన్ చేయాలని పెద్దపెల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. తమ పిల్లల చదువులకు ఇబ్బందులు అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోజురోజుకు పెరుగుతున్న నిత్యవసర వస్తువుల ధరలతో ఆర్థిక భారం అవుతుందంటే దానికి తోడు పిల్లల చదువుకు ఇతర గ్రామాలకు పంపించడం వల్ల పెను భారం అవుతుందని పేర్కొంటున్నారు.
మంచరామిలో దాదాపు 10 ఏండ్ల నుంచి సర్కారు బడి లేకపోవడంతో ప్రైవేట్ పాఠశాలలకు పంపించడంతో ఒకటో తరగతి పిల్లలకు సంవత్సరానికి రూ.20 వేల వరకు ఖర్చు అవుతుందని అంటున్నారు. ఇంకా వ్యాను పుస్తకాలు దుస్తులు ఖర్చులు కాకుండానే అవుతున్నాయని అధికారులు స్పందించి సర్కారు బడిని తెరవాలని కోరుతున్నారు.
గ్రామంలోని ప్రైమరీ పాఠశాలలో ఒకటో తరగతి నుంచి 5వ తరగతి వరకు ఉంది. దాదాపు 10 సంవత్సరాల క్రితం వివిధ కారణాలతో సర్కార్ బడి మూతబడింది. దీంతో అప్పటి నుంచి దాదాపుగా 40 మంది విద్యార్థులు వివిధ తరగతుల వారు సుల్తానాబాద్తోపాటు తదితర గ్రామాలకు వెళ్లి ప్రైవేట్ పాఠశాలలో విద్యను అభ్యసిస్తున్నారు. మంచిరామిలో మొత్తం 1386 మంది జనాభా ఉండగా, 494 కుటుంబాలు ఉన్నాయి. రికార్డుల ప్రకారం 391 గృహాలు ఉన్నాయి. గ్రామం నుంచి ఎంతోమంది ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారు ఉన్నారు. ప్రస్తుతం పెద్దపెల్లి జిల్లా పంచాయతీ అధికారి వీర బుచ్చయ్యతోపాటు ఐదుగురు ప్రభుత్వ ఉపాధ్యాయులు, ఒక పంచాయతీ కార్యదర్శి, ఒక కానిస్టేబుల్ ఇలా గ్రామం నుంచి మరెందరో ఉన్నారు. ఇప్పటికైనా మళ్లీ సర్కారు బడిని తెరిపించాలని గ్రామస్తులు సంబంధిత విద్యాశాఖ అధికారులను కోరుతున్నారు.
ప్రైవేటులో పైసల మోత..
వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం ఆవుల శ్యామల అన్నారు. ప్రైవేటు పాఠశాలలకు పిల్లలను పంపిస్తే పైసల మోత అవుతుంది. నా కూతురు సుల్తానాబాద్ లోని విజ్ఞాన్ ప్రైవేట్ పాఠశాలలో రెండవ తరగతి చదువుతుంది. సంవత్సరానికి రూపాయలు 20 వేల వరకు అవుతున్నాయి. మళ్లీ రవాణా ఖర్చులు అదనంగా అవుతున్నాయి. ఉదయం వ్యవసాయం పనులకు ఏదో తిని పోతాం. కానీ పిల్లల కోసం నాలుగు గంటలకి నిద్ర లేచి వంట చేసి వాళ్లను తయారుచేసి వ్యాన్ కు ఎక్కించాకనే మిగిలిన పనులు చేసుకోవాలి. అదే గ్రామంలో సర్కార్ బడి ఉంటే సమయానికి పంపించవచ్చు. దూరవరం కూడా తగ్గుతుంది. పుస్తకాలు దుస్తులు కొనాల్సిన అవసరం లేదు. మధ్యాహ్న భోజనం పథకం కూడా ఉంటుంది. అధికారులు స్పందించి బడిని తెరిపించాలని కోరారు.
బడికి విద్యార్థులు రాకనే మూత
మొదట పిల్లలు రాకపోవడంతోనే బడి మూతపడి ఉండొచ్చని సుల్తానాబాద్ ఎంఈవో రాజయ్య అన్నారు. అప్పటి కారణాలు నాకు తెలియదు. విద్యార్థులు రాకపోతే ఉపాధ్యాయులను విద్యార్థులు ఎక్కువ ఉన్న బడికి బదిలీ చేస్తారు. కానీ మంచరామి బడి విషయం నాకు పూర్తిగా తెలియదు. ప్రస్తుతానికి పిల్లలను సర్కారు బడికి పంపిస్తా అని గ్రామస్తులు సమాచారం ఇస్తే నేరుగా నేనే గ్రామానికి వెళ్లి అక్కడ విద్యార్థుల తల్లిదండ్రులతో సమావేశం ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాను.