సుల్తానాబాద్ రూరల్ జూన్ 25: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని మంచరామి గ్రామంలోని గత కొంతకాలంగా మూతబడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను బుధవారం తిరిగి ప్రారంభించారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాఠశాలకు హాజరయ్యారు. గత కొంతకాలం నుంచి ప్రాథమిక పాఠశాల మూతబడిపోవడంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు వారి పిల్లలను సుల్తానాబాద్ తదితర గ్రామాలకు పంపించారు. విద్యార్థుల తల్లిదండ్రులకు పిల్లలను దూర ప్రాంతాలకు పంపించడంతో భారంగా మారింది.
ఇటీవల నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘మూతబడ్డ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను తెరిపించాలని’ వచ్చిన కథనానికి మండల, జిల్లా విద్యాశాఖ స్పందించి రెండు, మూడు రోజులు గ్రామాన్ని సందర్శించి గ్రామస్తులతో విద్యార్థులు తల్లిదండ్రులతో మాట్లాడి మళ్లీ పాఠశాలను ప్రారంభించారు. దీంతో గ్రామస్తులు, పిల్లల తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేస్తూ పిల్లలను బడికి పంపించారు. పాఠశాల ఆవరణలో పిల్లలతో కళకళలాడుతుంది. గ్రామానికి చెందిన గంప కృష్ణ కిరణం షాపు యజమాని విద్యార్థులకు పలకలు, బలపాలు, బిస్కెట్లను అందజేశారు.