ధర్మారం, జూలై 14: చుట్టపు చూపుగా తన సొంత బావ ఇంటికి వచ్చి విద్యుత్ షాక్ తగిలి బామ్మర్ది మరణించాడు. ఈ విషాదకర సంఘటన పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఈ సంఘటనలో మస్తం చంద్రయ్య (62) అనే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మారం మండల కేంద్రంలో పర్వతం పాపయ్య అనే వ్యక్తి గత కొన్నేళ్ల నుంచి ఇనుప సామాను కొనుగోలు వ్యాపారం నిర్వహిస్తున్నాడు.
పాపయ్య నివాసం ఉంటూనే అక్కడే అతడు వ్యాపారం చేసుకుంటూ ఉంటున్నాడు. ఈ క్రమంలో మంచిర్యాల పట్టణంలోని ఎన్టీఆర్ నగర్ వీధిలో నివాసం ఉంటున్న చంద్రయ్య అతని సొంత బావ పాపయ్య ఇంటికి చుట్టూ చూపుగా గత 15 రోజుల క్రితం వచ్చాడు. కాగా చంద్రయ్య బావ పాపయ్య, అతని సోదరి మమత వారి ఇద్దరు పిల్లలతో కలిసి కొమురవెల్లిలో దైవదర్శనానికి ఆదివారం ఉదయం వెళ్లారు. దీంతో ఒంటరిగా చంద్రయ్య ఇంటికి కాపలాగా ఉన్నాడు. అదే రాత్రి రాత్రి ఎల్ టి లైన్ విద్యుత్ తీగ ప్రమాదవశాత్తు తెగి కిందపడింది.
ఈ విషయాన్ని గమనించని చంద్రయ్య ఇంటిముందు రాత్రి సమయంలో పడి ఉన్న విద్యుత్ తీగను ఏదో ఇనుప రాడ్ పడి ఉందని దానిని తీసే ప్రయత్నం చేశాడు. దీంతో విద్యుత్ షాక్కు గురై చంద్రయ్య అక్కడికక్కడే మరణించాడు. గమనించిన స్థానికులు విద్యుత్ శాఖ అధికారులకు సమాచామిచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతుడికి ముగ్గురు కుమారులు, ఒక కూతురు ఉంది. కాగా, బాధిత కుటుంబానికి విద్యుత్తు శాఖ తరపున నష్టపరిహారం అందించి ఆదుకోవాలని కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు.