కమాన్ పూర్, ఫిబ్రవరి 26: రోడ్డు ప్రమాదంలో(Road accident)గాయపడి వ్యక్తి మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని జూలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కమాన్ పూర్ మండల కేంద్రం నుండి యైటింక్లైన్ కాలనీకి వెళ్తున్న టాటా ఏసీ ఆటో ట్రాలీ వాహనం జూలపల్లి గ్రామంలోని మల్లికార్జున నగర్ మూలమలుపు వద్ద సైకిల్ పై ఎదురుగా వస్తున్న బొడ్డుపెల్లి రాయమల్లు(51) అనే వ్యక్తిని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాయమల్లు తీవ్రంగా గాయపడ్డారు.
క్షతగాత్రుడిని కుటుంబ సభ్యులు చికిత్స కోసం గోదావరిఖనిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు సూచించారు. ఈ మేరకు మెరుగైన చికిత్స కోసం కరీంనగర్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కు తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని వెల్లడించారు. మృతుడికి భార్య కనకమ్మ, కుమారుడు పూర్ణచందర్, కుమార్తెలు స్వప్న, రజిత ఉన్నారు. మృతుని కుటుంబ సభ్యులు ఇచ్చిన పిర్యాదు మేరకు కమాన్ పూర్ ఎస్ఐ కొట్టె ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.